Bengal Man:ఓ నిరుపేద దీనగాథ : అంబులెన్స్‌కు డబ్బుల్లేక , బిడ్డ మృతదేహాన్ని బ్యాగులో దాచి 200 కి.మీ బస్సులో
Send us your feedback to audioarticles@vaarta.com
శాస్త్ర , సాంకేతిక రంగాల్లో భారతదేశం అగ్రరాజ్యాలను సవాల్ చేస్తున్న పరిస్ధితుల్లో .. వచ్చే దశాబ్ధంలో ఇండియా తిరుగులేని శక్తిగా నిలుస్తుందని సర్వేలు చెబుతుంటే మనకు ఆనందం కలగొచ్చు. కానీ దేశాన్ని ఇంకా ఎన్నో సమస్యలు పట్టిపీడుస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేటికి మౌలిక వసతులు లేవు. నేటికీ వైద్యం కోసం 100 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. అనారోగ్యంతో కన్నుమూసిన బిడ్డ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ లేకపోవడంతో ఓ తండ్రి బాబును ఓ బ్యాగ్‌లో పెట్టుకుని 200 కిలోమీటర్లు ప్రయాణించాడు.
ఇద్దరు కవలల్లో ఒక్కరే దక్కారు :
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ దినాజపూర్ జిల్లాలోని కలియాగంజ్ ప్రాంతానికి చెందిన అసిమ్ దేవశర్మ ఓ కూలీ. అతనికి ఐదు నెలల వయసున్న కవల పిల్లలు వున్నారు. ఈ క్రమంలో పిల్లలిద్దరూ ఇటీవల అనారోగ్యానికి గురవ్వడంతో వారిని కలియాగంజ్ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ వీరి పరిస్థితి విషమించడంతో చిన్నారులను సిలిగురిలోని వెస్ట్ బెంగాల్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఓ చిన్నారి కోలుకోగా.. మరో చిన్నారి మాత్రం శనివారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో దేవశర్మ కన్నీరుమున్నీరుగా విలపించాడు.
అంబులెన్స్ కావాలంటే రూ.8 వేలు చెల్లించాల్సిందేన్న సిబ్బంది:
ఇదే బాధ అనుకుంటే .. బిడ్డను 200 కిలోమీటర్ల దూరంలోని తన ఇంటికి తీసుకెళ్లాలి. 102 పథకం కింద రోగులకు మాత్రమే అంబులెన్స్ ఉచితమని.. మృతదేహాలను తీసుకెళ్లడానికి డబ్బు చెల్లించాలని అంబులెన్స్ డ్రైవర్లు తెగేసి చెప్పారు. అలాగ అంబులెన్స్ కోసం రూ.8 వేలు చెల్లించాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. అయితే అప్పటికే చేతిలో వున్నదంతా ఖర్చవ్వగా, అంబులెన్స్‌కు ఇచ్చేందుకు ఏం లేదు. దీంతో చేసేదేం లేక చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో ఎవరికి కనిపించకుండా దాచి, దాదాపు 200 కి.మీ బస్సులో ప్రయాణించాడు. ఎట్టకేలకు కలియాగంజ్ చేరుకుని అక్కడి నుంచి అంబులెన్స్‌తో చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు దేవశర్మ.
బెంగాల్‌ను ఊపేస్తున్న ఘటన :
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెంగాల్ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై ప్రతిపక్షనేత సువేందు అధికారి స్పందించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘‘స్వస్థ్య సాథి’’ ఆరోగ్య పథకంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో బెంగాల్‌లో పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments