ఇకపై దుర్గమ్మను దర్శించుకోవాలంటే డబుల్ చెల్లించుకోవాల్సిందే..
Send us your feedback to audioarticles@vaarta.com
బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి రేట్లు భారీగా పెంచేశారు. ఈ నిర్ణయాన్ని దుర్గగుడి అధికారులు తీసుకోగా.. దీనికి దేవస్థానం పాలకమండలి సమావేశంలో చర్చించి తీర్మానానికి ఆమోదముద్ర కూడా వేసేశారు. దీంతో పంచహారతుల ఆర్జిత సేవా టికెట్ల ధరతో పాటు పులిహోర ప్రసాదం ధర సైతం దాదాపు రెట్టింపైంది. పంచహారతుల సేవ ప్రతిరోజూ సాయంత్రం వేళ జరుగుతుంది. ఇప్పటి వరకూ రూ.500 ఆర్జిత సేవా టికెట్‌పై అమ్మవారి దర్శనానికి ఇద్దరు భక్తులను అనుమతిస్తున్నారు.
ఇకపై పంచహారతుల సమయంలో దంపతులు పంచహారతుల సేవకు వెళ్లాలంటే రూ.1,000 సమర్పించుకోవాల్సిందే. అంటే గతంలో దానికి డబుల్ చెల్లించుకుంటే తప్ప దంపతులు పంచహారతుల సేవకు వెళ్లే అవకాశం లేదు. అలాగే అమ్మవారి పులిహోర ప్రసాదం విషయంలోనూ రేట్లు పెంచేశారు. ప్రస్తుతం 150 గ్రాముల ప్యాకెట్ రూ.5కు విక్రయిస్తుండగా... దానిని ప్యాకెట్‌ను 200 గ్రాములకు పెంచి రూ.10కు విక్రయించాలని నిర్ణయించారు. ఈ మార్పులన్నీ జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.
ఇక మరో కీలక మార్పును సైతం దుర్గ గుడి అధికారులు తీసుకురానున్నారు. తిరుమల తరహాలో ఇంద్రకీలాద్రిపై కూడా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిని అనుమతి కోసం దేవదాయశాఖ కమిషనర్‌కు పంపేందుకు తీర్మానాన్ని ఆమోదించారు. అలాగే ఇక నుంచి ఏటా కార్తీక పౌర్ణమి రోజున ఉదయం 6-9 గంటల వరకు ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షణ నిర్వహించేందుకు సైతం పాలకమండలి తీర్మానం చేసింది. మరోవైపు కొండపైన, దిగువన మొబైల్ క్యాంటీన్లు నిర్వహించుకునేందుకు ప్రైవేటు వ్యాపారులకు లైసెన్సులు మంజూరు చేయాలని భావించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout