సుప్రీంకోర్టులో బీప్ సౌండ్ రావడంతో పరుగులు.. తీరాచూస్తే..!

  • IndiaGlitz, [Friday,February 14 2020]

సుప్రీంకోర్టులో కేసులు విచారణ జరుగుతున్నాయ్.. ఇంతలో బీప్ బీప్ అనే సౌండ్ ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. ఇంతలో ఓ అనుమానస్పద బ్యాక్ కనిపించింది. అందులో బాంబు ఉందేమో అని కోర్టులో ఉన్నవారంతా జంకారు. తీరా చూస్తే.. అసలు అది బాంబు కాదు.. ఈ ఘటనతో సుప్రీం లోపల, బయట ఒక్కసారిగా జనాలు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఇవాళ సుప్రీం కోర్టు లోపల ఏం జరిగిందనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.

అసలేం జరిగింది!?
శుక్రవారం నాడు దేశ అత్యున్నత న్యాయస్థానంలో పలు కేసులు విచారణ జరుగుతున్నాయి. ఈ క్రమంలో బీప్ బీప్ అంటూ సౌండ్ వస్తోంది. ఇది గమనించిన కోర్టు లోపలి వ్యక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే.. ఓ బ్యాగ్ నుంచి ఈ సౌండ్ వస్తున్నట్లు లాయర్లు గుర్తించారు. అది బాంబ్ సౌండని కొందరు లాయర్లు అనుమానించారు. ఒక్కసారిగా అందరూ పరుగులు తీయడం మొదలుపెట్టారు. కోర్టు లోపలే కాదు బయట ఉండే జనాలు కూడా ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి జాగ్రత్తగా ఆ బ్యాగును అక్కడ్నుంచి బయటికి తీసుకొచ్చారు.

ఏం చేశారు!?
ఆ బ్యాగ్‌ను గ్రౌండ్‌లోకి తీసుకెళ్లి నిశితంగా పరిశీలించగా అందులో ఓ పవర్ బ్యాంక్, కొన్ని పేపర్లు మాత్రమే ఉందని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించింది. పవర్ బ్యాంకులో పూర్తిగా చార్జింగ్ తగ్గిపోవడంతో అలర్ట్ చేస్తూ బీప్ బీప్ మంటూ శబ్దం చేస్తున్నట్టు తేలడంతో కోర్టు ప్రాంగణంలోని జనాలంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ఆ బ్యాగును కంట్రోల్ రూమ్‌కు సిబ్బంది అప్పగించారు. అయితే ఎలాగో అనుమానం వచ్చింది కదా అని మరింత మంది సిబ్బంది రంగంలోకి దిగి కోర్టు హాళ్లతో పాటు.. పరిసర ప్రాంతాలన్నీ తనిఖీలు చేశారు. ఎక్కడా ఏమీ లభించకపోవడంతో కథ ముగిసింది. మొత్తానికి చూస్తే.. చిన్నపాటి పవర్ బ్యాంక్ ఇవాళ సుప్రీంకోర్టులో జనాలందర్నీ భయపెట్టింది.