Barrelakka:ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బర్రెలక్క
Send us your feedback to audioarticles@vaarta.com
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మార్మోగిన పేరు బర్రెలక్క అలియాస్ శిరీష. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఓడిపోయినా ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు. డబ్బుతో ముడిపడి ఉన్న నేటి రాజకీయాల్లో ఓ ఆశాకిరణంగా నిలిచారు. ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు లొంగకుండా, బెదిరింపులకు భయపడకుండా ఆమె పోరాడిన తీరు అభనందనీయం. అందుకే ప్రచారానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అలాగే ప్రముఖులు కూడా బర్రెలక్కకు పరోక్షంగా తమ మద్దతు తెలియజేశారు. ఆ ఎన్నికల్లో 5,754 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచిన ఆమె పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. యువత రాజకీయాల్లోకి వస్తేనే సమాజంలో మార్పు వస్తుందని తెలిపారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని ఓ సామాన్య వ్యక్తి డబ్బులు పంచకుండా 5వేలకు పైగా ఓట్లు సాధించడం అంటే మామాలు విషయం కాదన్నారు. అయితే.. అసెంబ్లీలో ఓడిపోయినా సరే నిరుద్యోగుల తరపున తన పోరాటం ఆపనంటూ బర్రెలక్క ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరనని.. ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని ఆ సమయంలో వెల్లడించారు.
కానీ ఇటీవలే తన స్నేహితుడు, సమీప బంధువు వెంకటేశ్‌ను పెళ్లి చేసుకున్నారు. దీంతో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయరేమో అనుకున్నారు. తాజాగా ముందు చెప్పినట్టుగానే లోక్‌సభ ఎన్నికల బరిలో కూడా నిలిచారు. ఈ మేరకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎలాంటి హడావిడి లేకుండా.. కేవలం తన భర్త, కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
కాగా ఈ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తు్ండగా.. కాంగ్రెస్ నుంచి మల్లు రవి.. బీజేపీ నుంచి పోతుగంటి భరత్ బరిలో ఉన్నారు. గతంలో బర్రెలక్కకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సపోర్ట్ చేశారు. బీఎస్పీలో చేరాలని ఆహ్వానించారు. ఇప్పుడు అదే ఆర్ఎస్పీ మీదే ప్రత్యర్థిగా బర్రెలక్క పోటీకి దిగుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments