Barrelakka:బర్రెలక్కకు పెరుగుతున్న ప్రముఖుల మద్దతు.. తాజాగా తెలుగు హీరో సపోర్ట్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మార్మోగుతున్న పేరు బర్రెలక్క అలియాస్ శిరీష. స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే స్థానానికి ఆమె పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఈ యువతి గురించే చర్చ. సోషల్ మీడియాలో యువత అంతా బర్రెలక్కకే సపోర్ట్ చేస్తున్నారు. ‘డిగ్రీలు చేసినా.. ఉద్యోగం రాలేదంటూ. అందుకే బర్రెలు కొనుక్కున్నానంటూ’ చేసిన ఓ వీడియోతో బర్రెలక్కగా ఫేమస్ అయ్యింది. అప్పటి నుంచి వీడియోలు చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లూయరెన్స్గా మారింది. ఇప్పుడు ఏకంగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిలిచింది. తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ దూసుకుపోతోంది. స్థానిక యువత కూడా ఆమెకు మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం బర్రెలక్క ఎన్నికల ప్రచారం చేస్తుండగా కొందరు ఆమె తమ్ముడిపై దాడి చేయడం కలకలం రేపింది. దీంతో తనను ప్రచారం కూడా చేసుకోనివ్వడం లేదంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో వైరల్ కావడంతో శిరీషకు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు మద్దతు పలుకుతున్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బర్రెలక్కకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. అలాగే ఆమెకు రక్షణ కల్పించాలని ఎన్నికల అధికారులు, డీజీపీని కోరారు. మరికొందరైతే ఏకంగా విరాళాలు సైతం అందిస్తున్నారు. తాజాగా సినీ నటుడు రాజా కూడా ఆమెకు మద్దతు తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే ఈ ఎన్నికల్లో శిరీష గెలవాలని తెలిపారు. శిరీష ధైర్యానికి మెచ్చుకోవాల్సిందేనని.. ఇలాంటి వాళ్లు గెలిస్తే యువతలో కొత్త చైతన్యం వస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే ప్రచారంలో తన సోదరుడిపై దాడి నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలని బర్రెలక్క హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు తనకు 2ప్లస్ 2 గన్మెన్లను కేటాయించాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఇక కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున బీరం హర్హనవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి జూపల్లి కృష్ణారావు, బీజేపీ నుంచి అల్లెని సుధాకర్ రావు బరిలో ఉన్నారు. ఇలాంటి సీనియర్ నాయకుల మధ్య బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలవడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout