Vyooham:'వ్యూహం' సినిమా విడుదలకు బ్రేక్.. రామ్గోపాల్ వర్మపై బర్రెలక్క ఫిర్యాదు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన 'వ్యూహం' సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. వ్యూహం సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీడీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) టీఎస్ హైకోర్డును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సినిమా విడుదలకు బ్రేక్ వేస్తూ గురువారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 11కు వాయిదా వేసింది. దీంతో ఇవాళ విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. తాజాగా న్యాయస్థానం తీర్పుపై వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ్ (Ram Gopal Varma) స్పందించారు. 'కొన్ని ఛానెళ్లలో వస్తున్నట్లుగా వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు కాలేదు. అసలు నిజం ఏంటంటే సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ ఇవ్వడానికి సంబంధించిన డాక్యుమెంట్స్ జనవరి 12 లోపు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది' అని తెలిపారు.
దివంగత మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఆ తర్వాత జగన్ సీఎం ఎలా అయ్యారు? అనే అంశాలతో ఆర్జీవీ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే సినిమాలో చంద్రబాబు ప్రతిష్టని దెబ్బతీసేలా తెరకెక్కించారని సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ లోకేశ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే 'వ్యూహం' సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డి. నాగేశ్వరావు, ఉపాధ్యక్షులు మీసాల రాజేశ్వరరావు సంయుక్తంగా రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ సినిమాలో సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ పరువుకు నష్టం కలిగించేలా పాత్రలు ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. సోనియాగాంధీ, చంద్రబాబు కుమ్మక్కై జగనపై ఈడీ కేసులు పెట్టి జైల్లో అక్రమంగా పెట్టినట్లు సినిమాలో సన్నివేశాలు పెట్టారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 139 సంవత్సరాలు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా వ్యూహం సన్నివేశాలు ఉన్నాయన్నారు. తక్షణమే సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది.
మరోవైపు రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క అలియాస్ శిరీష తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇటీవల విజయవాడలో'వ్యూహం'సినిమా ఆడియో ఫంక్షన్లో బర్రెలక్క గురించి వర్మ మాట్లాడుతూ 'బర్రెలక్క బర్రెలు కాస్తుంది. బర్రెలు ఆమె మాటలు వింటాయి. అందుకే ఆమెను బర్రెలక్క అంటారు'అని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బర్రెలక్క.. వర్మ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఆమె తరపు న్యాయవాది రాజేశ్ కుమార్.. మహిళా కమిషన్ను కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments