బార్క్ కీలక నిర్ణయం.. 12 వారాల పాటు రేటింగ్స్ నిలిపివేత..
- IndiaGlitz, [Friday,October 16 2020]
బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసర్చ్ కౌన్సిల్(బార్క్) కీలక నిర్ణయం తీసుకుంది. వీవర్ షిప్ ఆధారంగా టెలివిజన్ ఛానెల్స్‌కు రేటింగ్ ఇచ్చే ప్రక్రియను ఏకంగా 12 వారాలపాటు నిలుపుదల చేస్తున్నట్టు బార్క్ ప్రకటించింది. ఇంగ్లీష్, హిందీ సహా స్థానిక ఛానెల్స్‌తో పాటు బిజినెస్ న్యూస్ ఛానెల్స్‌పై కూడా ఈ ప్రభావం ఉండనున్నట్టు బార్క్ వెల్లడించింది. దీనిలో భాగంగానే ఇప్పటికే విడుదల కావాల్సిన వీకెండ్ రేటింగ్స్‌ని బార్క్ నిలిపివేసింది.
పలు ఛానెళ్లు టీఆర్పీ కుంభకోణానికి పాల్పడటంతో బార్క్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రమాణాలను టెక్నికల్ కమిటీతో చర్చించి మరింతగా మెరుగు పరచాలని బార్క్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో 12 వారాల పాటు రేటింగ్ ప్రక్రియను నిలిపివేసింది. బార్క్ నిర్ణయాన్ని న్యూస్ బ్రాడ్కాస్ట్స్ అసోసియేషన్(ఎన్బీఏ) సైతం స్వాగతించింది.
కాగా.. తప్పుడు టీఆర్పీలతో మోసాలకు పాల్పడుతున్న మూడు రిపబ్లిక్ చానెల్ సహా మరో రెండు మరాఠా చానళ్లపై ముంబై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకూ ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.