కేంద్రం కీలక నిర్ణయం.. ఆ రెండు బ్యాంకులు గోవిందా?

  • IndiaGlitz, [Tuesday,February 16 2021]

దేశంలో అన్ని రకాల సంస్థల ప్రైవేటీకరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా బ్యాంకుల వంతు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణపై వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే నాలుగు మధ్యస్థాయి బ్యాంకులను ప్రాథమికంగా ఎంపిక చేసి వాటిలో రెండింటిని ప్రైవేటీకరించబోతున్నట్టు సమాచారం. ఈ ఎంపిక ఉద్యోగుల సంఖ్య ఆధారంగా జరిగినట్టు తెలుస్తోంది. ఆ నాలుగు బ్యాంకుల్లో.. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్టు తెలుస్తోంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగుల సంఖ్య 50 వేలు కాగా.. సెంట్రల్ బ్యాంకులో 33 వేలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 26 వేలు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13 వేల మంది ఉన్నట్టు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. వీటిలో తక్కువ ఉన్న రెండు బ్యాంకులను తొలుత ప్రైవేటు పరం చేస్తారని సమాచారం. దీంతో పై నాలుగు బ్యాంకుల్లో రెండు బ్యాంకులు గోవింద కాబోతున్నాయి. తద్వారా ఎదురయ్యే వ్యతిరేకతను చాలా వరకూ తగ్గించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బ్యాంకుల విక్రయం ద్వారా ఎదురయ్యే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అనంతరం మధ్యస్థాయి బ్యాంకుల విక్రయానికి ప్రభుత్వం అడుగులు వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి భారీ బ్యాంకుల విక్రయం దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడానికి కూడా ఇదే కారణంగా తెలుస్తోంది. ఈ బ్యాంకులను ప్రైవేటు పరం చేస్తే ప్రజల నుంచి సైతం వ్యతిరేకత వస్తుందని దానిని తట్టుకోవడం చాలా కష్టమని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ముందుగా మధ్యస్థాయి బ్యాంకులను ప్రభుత్వం ఎంచుకుంటోంది. అయితే వీటి ప్రైవేటీకరణకు ఐదారు నెలలు సమయం పడుతుందని సమాచారం. మరోవైపు.. ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఉద్యోగసంఘాలు సైతం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆ దిశగా యూనియన్లు ఆందోళనలు ప్రారంభించాయి.