Shridi Sai:షిర్డీ సాయికి ‘నాణేల’ సమస్య.. ఇప్పటికే లాకర్లు ఫుల్, మాకొద్దు బాబోయ్ అంటోన్న బ్యాంక్‌లు
- IndiaGlitz, [Friday,April 21 2023]
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయి ఆలయానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ సందర్భంగా ఎవరి స్థోమతకు తగినట్లుగా వారు హుండీలో మొక్కులు చెల్లించుకుంటూ వుంటారు. ఇలా బంగరం, వెండి, ఇతర బహుమతులు, కరెన్సీని సమర్పిస్తారు. అయితే మెజారిటీ భక్తులు మాత్రం నాణేలనే సమర్పిస్తూ వుంటారు. ఇవే ఇప్పుడు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, బ్యాంకులను ఇబ్బందులకు గురిచేస్తోంది. భక్తులు ప్రతినిత్యం సాయిబాబాకు సమర్పించే కానులకు ఆలయ సిబ్బంది లెక్కించి కరెన్సీ, నాణేలను ఆలయం పేరిట వున్న బ్యాంకుల్లో జమ చేస్తారు. దీని ద్వారా ట్రస్ట్‌కు ప్రతి ఏటా కోట్లలో ఆదాయం వస్తుంది.
బ్యాంక్ లాకర్లలో టన్నుల కొద్దీ నాణేలు :
అయితే షిర్డీ ఆలయానికి సంబంధించిన ఖాతాలు మాత్రం ఇకపై నాణేలను డిపాజిట్ల రూపంలో తీసుకోబోమని తేల్చిచెబుతున్నాయి. తమ వద్ద టన్నుల కొద్దీ నాణేలు నిల్వ వుండటంతో అవి చేతులెత్తేస్తున్నాయి. అహ్మద్ నగర్ జిల్లాలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ పచేగావ్, ఔరంగాబాద్‌లోని కెనరా బ్యాంక్‌లో షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ కానుకలను డిపాజిట్ చేస్తూ వస్తోంది. అలా మొత్తంగా సాయి ఆలయం పేరిట రూ.2600 కోట్లు డిపాజిట్ల రూపంలోవున్నాయి. దీనిపై వడ్డీ రూపంలో ప్రతి యేటా వందల కోట్ల ఆదాయం ఆలయానికి సమకూరుతోంది.
నాణేల సమస్యపై బ్యాంకుల పోరాటం:
ఇక ప్రతినిత్యం భక్తులు సమర్పించే కానుకలను వారానికి రెండు సార్లు లెక్కిస్తున్నారు ఆలయ అధికారులు. అయితే కరెన్సీని తీసుకోవడానికి అంగీకరిస్తున్న బ్యాంక్ సిబ్బంది.. నాణేల విషయంలో మాత్రం తమ వల్ల కాదు బాబోయ్ అంటున్నారు. నాణేలను నిల్వ చేసేందుకు తమ వద్ద స్థలం లేదని అవి వాపోతున్నాయి. అంతేకాదు.. ఆలయానికి చెల్లించే వడ్డీతో పాటు వీటిని భద్రపరిచేందుకు అయ్యే ఖర్చు బ్యాంకులకు తడిసి మోపెడవుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులన్నీ కలిసి పోరాటం చేస్తున్నాయి. అంతేకాదు.. ఆర్‌బీఐ దిగివచ్చి ఈ నాణేలను స్వీకరిస్తే కానీ సమస్యకు పరిష్కారం లభించదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో మాట్లాడతామని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సీఈవో రాహుల్ జాదవ్ తెలిపారు.