ఆ పబ్‌లో నేను లేను..  నా పేరేందుకు లాగుతున్నారు, వారి పనే : పీఎస్ వద్ద హేమ రచ్చ రచ్చ

  • IndiaGlitz, [Sunday,April 03 2022]

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ ఆవరణలోని పుడింగ్ పబ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల పిల్లలు పబ్‌లో ఉన్నారని తేలడంతో అందరి దృష్టి ఇటువైపే నిలుస్తోంది. ఇదే సమయంలో తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ కొందరు ప్రముఖులు వ్యక్తిగతంగా ఖండించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే సినీ నటి హేమ ఏకంగా బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గరకు వచ్చారు. తాను పబ్‌లో లేకపోయినా.. నా పేరు ఎందుకు బయటకు తెచ్చారంటూ పోలీసులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కేసుతో తనకు సంబంధం లేకున్నా తన పేరును పలు ఛానళ్లలో ప్రసారం చేస్తున్నారని హేమ ఫైరయ్యారు. తన గురించి అవాస్తవాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు తెలిపారు. డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయం కాదన్న ఆమె.. కొందరు కావాలనే తన పేరును ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు.. టీడీపీ ఎంపీ, అమర్‌రాజా గ్రూప్ అధినేత గ‌ల్లా జ‌య‌దేవ్ కుమారుడు, సినీ న‌టుడు గ‌ల్లా అశోక్‌ కూడా పబ్‌లో ఉన్న‌ట్లు మీడియాలో వార్తలు వ‌స్తున్నాయి. అయితే, ఈ విషయంపై గల్లా కుటుంబ స‌భ్యులు స్పందించారు. పబ్ వ్య‌వ‌హారంలో గల్లా అశోక్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. దయచేసి అలాంటి నిరాధారమైన వార్తలని మీడియాలో ప్రసారం చేయ‌కూడ‌దని గ‌ల్లా ఫ్యామిలీ కోరింది.