Jayalalitha: పెద్ద ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి.. జయలలిత బంగారు ఆభరణాలు తీసుకెళ్లండి..
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha)కు సంబంధించిన బంగారు ఆభరణాల విషయంలో కర్ణాటకలోని బెంగళూరు కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తమిళనాడు ప్రభుత్వానికి ఆభరణాలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రెండు రోజులను కేటాయించింది. ఆ రెండు రోజుల్లో ఆభరణాలను తీసుకెళ్లేందుకు ఆరు ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తం 27 కేజీల బంగారు, వజ్రా భరణాలతో పాటు, 700 కేజీలకుపైనే వెండిని ప్రభుత్వానికి అప్పగించనుంది. ఈ రెండు రోజుల్లో ఇతర కేసులను విచారించకూడదని కోర్టు నిర్ణయించింది.
మార్చి 6, 7 తేదీల్లో వచ్చి బంగారు, వజ్రాభరణాలను తీసుకెళ్లాలని సూచించింది. బంగారు ఆభరణాలు తీసుకోవడానికి ఒక అధికారిని నియమించినట్లు న్యాయస్థానం తెలిపింది. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలంది. కోర్టు నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకునే సమయంలో ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలు, అవసరమైన భద్రత సిబ్బందితో రావాలని ఆదేశాలు జారీ చేసింది. నగలను తమిళనాడు రాష్ట్రానికి అప్పగించేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే కర్ణాటక ప్రభుత్వానికి లిటిగేషన్ ఫీజుగా రూ.5కోట్లు చెల్లించాలని కూడా తెలిపింది.
తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్న సమయంలో అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని ఆమె నివాసం నుంచి అధికారులు పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో జయలలిత దోషిగా తేలడంతో 2014లో బెంగళూరు కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విధించింది. అలాగే స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బీఐ, ఎస్బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టంచేసింది. అయితే ఇంతలోనే జయలలిత మరణించారు.
దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయించింది. అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో 7 కేజీల 40 గ్రాములు బరువున్న 468 రకాల బంగారు, వజ్రాభరణాలు.. 700 కిలోల వెండి వస్తువులు, 740 ఖరీదైన చెప్పులు, 11,344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్లు, 4 సీడీ ప్లేయర్లు, ఒక్క వీడియో కెమెరా, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు, 1,040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, రూ.1,93,202 నగదు ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout