Bandobast Review
తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ హీరోల్లో సూర్య ఒకడు. ఈయనకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అయితే `గజినీ`, `సింగం` సిరీస్ చిత్రాల తర్వాత తమిళంలో ఈయన చిత్రాలు బాగానే ఆడుతున్నా.. తెలుగులో మాత్రం ఆశించిన స్థాయి విజయాలను అందుకోలేకపోతున్నాయి. తెలుగు, తమిళంలో భారీ హిట్ కోసం సూర్య తన చిత్రాలను ఏక కాలంలో విడుదల చేస్తూనే వస్తున్నారు. ఆ కోవలో ఈ సారి సూర్య `బందోబస్త్` పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళంలో `కాప్పాన్` పేరుతో ఈ చిత్రం విడుదలైంది. ఇది వరకు సూర్యతో `వీడొక్కడే`, `బ్రదర్స్` చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మరీ చిత్రం ప్రేక్షకులను ఏ మేర మెప్పించింది. సూర్యకు మంచి హిట్ వచ్చిందా? లేదా? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
కథ:
మిలటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రవికాంత్(సూర్య) దేశం కోసం చేసిన సీక్రెట్ ఆపరేషన్ విజయవంతం అవుతుంది. అక్కడ నుండి మరో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి లండన్‌లో ప్రధాని చంద్రకాంత్ వర్మ(మోహన్‌లాల్)ని కాపాడుతాడు. రవికాంత్ ధైర్యసాహసాలు నచ్చిన ప్రధాని ఆయన్ని తన ఎన్.ఎస్.జిగా నియమించుకుంటాడు. అయితే ఎవరో ఓ వ్యక్తి రవికాంత్, అతని టీమ్‌పై ఎటాక్ చేస్తాడు. అలాగే కాశ్మీర్ పర్యటనలోని చంద్రకాంత్‌ను బాంబ్ బ్లాస్ట్ చేసి చంపేస్తారు. చంద్రకాంత్ స్థానంలో ఆయన కొడుకు అభిషేక్(ఆర్య) ప్రధాని అవుతాడు. అభిషేక్ కూడా రవికాంత్‌ను తన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమించుకుంటాడు. దేశంలో పెద్ద బిజినెస్ మ్యాన్ మహదేవ్(బోమన్ ఇరాని) గోదావరి జిల్లాల్లో అక్రమ మైనింగ్ చేస్తుంటాడు. అభిషేక్‌కి ఆ విషయం నచ్చదు. దాంతో మహదేవ్‌పై దాడి జరిపిస్తాడు. అప్పుడు మహదేవ్ ఏం చేస్తాడు? అభిషేక్ వర్మను సూర్య ఎలా కాపాడుకుంటాడు? అనే సంగతులు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
- సూర్య నటన
- కెమెరా పనితనం
- యాక్షన్ పార్ట్
మైనస్ పాయింట్స్:
- పాటలు
- సినిమాను మరింత ఆసక్తికరంగా నడిపించి ఉండాల్సిందనిపిస్తుంది
విశ్లేషణ:
నటీనటుల విషయానికి సూర్య సెంటర్ ఎట్రాక్షన్ అయ్యాడు. తన చుట్టూనే ప్రధానంగా కథను నడిపించాడు దర్శకుడు కె.వి.ఆనంద్. ఎన్.ఎస్.జి కమొండోగా నటించిన సూర్య లుక్, ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. యాక్షన సన్నివేశాల్లో చక్కగా నటించాడు. కథానుగుణంగా సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. ఇక ప్రధాని పాత్రలో మోహన్‌లాల్ చక్కగా నటించారు. ఆయన పాత్ర పరిధి మేర నటన హుందాగా అనిపిస్తుంది. ఇలాంటి పాత్రలను చేయడం ఆయనకు కొట్టిన పిండి. ఆర్య రోల్ ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌లోనే కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ రోల్ ఎక్కడా నెగెటివ్ సెన్స్‌లో వెళుతుందోనని అనిపిస్తుంది. కానీ తన పాత్రలో ఎక్కడా ట్విస్టులుండవు. ఇక సయేషా సైగల్ పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. పాటలకు, రెండు, మూడు లవ్ సన్నివేశాలకు మాత్రమే ఆమె పరిమితమైంది. సుముద్రఖని, పూర్ణ తదితరులు వారి వారి పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతికంగా చూస్తే వీడొక్కడే, బ్రదర్స్ చిత్రాల్లో వైవిధ్యమైన పాయింట్స్‌ను టచ్ చేసిన దర్శకుడు కె.వి.ఆనంద్ ఈ చిత్రంలో కూడా వైవిధ్యమైన పాయింట్‌ను టచ్ చేశాడు. ఎంటోమోలాజికల్ వార్ అనే పాయింట్‌ను టచ్ చేశాడు. అదేంటో తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. సన్నివేశాలను ఆసక్తిరంగా మలిచాడు. ముఖ్యంగా థ్రిల్లింగ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే దేశంలో రైతులు సమస్యలు, కార్పొరేట్ కంపెనీస్ వారు బ్రతకడం కోసం రైతులకు చేసే ద్రోహం అనే పాయింట్‌ను టచ్ చేశాడు. అలాగే ఎన్.ఎస్.జి కమొండోలు బుల్లెట్స్‌కు ఎదురెళ్లి ఎలా కాపాడుతారనే అంశాలను ఇందులో టచ్ చేశాడు. అయితే సినిమాలో పాటలు, లవ్ ట్రాక్ సినిమాను డైవర్ట్ చేస్తాయి. కానీ మళ్లీ దర్శకుడు ట్రాక్ ఎక్కించాడు. అతనికి సినిమాటోగ్రాఫర్ ఎం.ఎస్.ప్రభు, బ్రౌగ్రౌండ్ స్కోర్‌తో హేరీష్ జైరాజ్ సపోర్ట్ అందించారు. పాటలు బాగా లేవు. నిర్మాణ విలువలు బావున్నాయి.
బోటమ్ లైన్: బందోబస్త్... ఆకట్టుకునే యాక్షన్ థ్రిల్లర్
Read Bandobast Review in English
- Read in English