'బందోబస్త్' కంప్లీట్ ఆల్ రౌండ్ ఎంటర్ టైనర్ - ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్య

  • IndiaGlitz, [Saturday,September 14 2019]

ప్రతి చిత్రంలోనూ పాత్ర పరంగా నటనలోనూ, ఆహార్యంలోనూ వైవిధ్యం కనబరిచే కథానాయకుల్లో సూర్య ఒకరు. 'గజిని', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్', 'సింగం' సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆయన స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన తాజా సినిమా 'బందోబస్త్'. డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి 'రంగం' ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. తెలుగు ప్రేక్షకులకు 'నవాబ్', విజువల్ వండర్ '2.0' చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మించారు. హ్యారీస్ జైరాజ్ సంగీతం అందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్వీఆర్ సినిమా పతాకంపై ప్రముఖ తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

అనంతరం డి. సురేష్ బాబు మాట్లాడుతూ లైకా ప్రొడక్షన్స్, తెలుగులో విడుదల చేస్తున్న ఎన్వీ ప్రసాద్ గారికి ఆల్ ది బెస్ట్. సూర్య మాకు ఫ్యామిలీలాగే. మా నాన్నగారి సినిమాల్లో వాళ్ళ నాన్నగారు నటించారు. సూర్యతో నేను ఎప్పుడు సినిమా చేస్తానో నాకు తెలియదు. మంచి మనిషి. వాళ్ళది లవ్లీ ఫ్యామిలీ. తనకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

సూర్య మాట్లాడుతూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఇంత భారీగా తారాగణం, ఉన్నత నిర్మాణ విలువలతో రావడానికి కారణమైన లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ గారికి థాంక్స్. మా టీమ్ అందరి కలను ఆయన నిజం చేశారు. సెప్టెంబర్ 20న తెలుగులోనూ భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తున్న ఎన్వీ ప్రసాద్ గారికి థాంక్స్. లైకా ప్రొడక్షన్స్, ఎన్వీ ప్రసాద్ గారి అమేజింగ్ అసోసియేషన్ గురించి నాకు ఈ రోజు తెలిసింది. ఇక్కడికి వచ్చిన సురేష్ బాబుగారికి థాంక్స్. వర్కింగ్ డే అయినప్పటికీ... ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు అందరికీ థాంక్స్. మీరు ఇచ్చే కిక్, హై డిఫరెంట్. ఈ 'బందోబస్త్' కంప్లీట్ ఎంటర్టైనర్ ఫిల్మ్. మీ అందరికీ నచ్చుతుంది. జర్నలిస్ట్ బ్యాగ్రౌండ్ నుండి కెవి ఆనంద్ సార్ వచ్చారు. రియల్, ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఆయన సినిమాలు తీస్తారు. ఈ సినిమానూ అలాగే తీశారు. ఇందులో నేను చేసిన పాత్ర నాకు చాలా కొత్త. నాకు కొత్త ఎక్స్ పీరియన్స్. మనకు ఉద్యోగాలు ఉన్నాయి. మనం కష్టపడినందుకు జీతం వస్తుంది. మన దేశం కోసం, భద్రత కోసం ఎంతో మంది నిజమైన హీరోలు, గుర్తింపుకు నోచుకొని హీరోలు సరిహద్దుల్లో ప్రతి రోజు నిలబడతారు. వాళ్లను నేను వ్యక్తిగతంగా కలవడం గొప్ప అనుభవం. దేశానికి ఎంతో సేవ చేసిన వారందరూ వేదికల మీదకు ఎప్పుడూ రారు. గుర్తింపు కోరుకోకుండా తమ తమ బాధ్యతలను నెరవేరుస్తుంటారు.

ఆ హీరోలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నమే ఈ 'బందోబస్త్'. వాళ్లు ఏం చేస్తారో చూపించే ప్రయత్నం చేశాం. నేను ఈ సినిమాలో ఎస్.పి.జి (స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్) కమాండోగా చేశా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి భద్రతగా నిలిచే ఫస్ట్ సర్కిల్ లో ఎస్.పి.జి కమాండోలు ఉంటారు. ఎవరైనా ఫైరింగ్ చేస్తే వాళ్లు పారిపోరు. తమ గుండెలు చూపిస్తారు. కుటుంబ జీవితాలను త్యాగం చేస్తారు. అటువంటి గొప్ప అధికారులకు నేను ఇచ్చే గౌరవం ఈ సినిమా. 'బందోబస్త్'తో వాళ్లకు థాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. 'బందోబస్త్' సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ మాత్రమే ఇవ్వదు, ఇంతకు ముందు ఎన్నడూ సినిమాల్లో చూడని కొత్త వాతావరణంలోకి ప్రేక్షకులనుతీసుకు వెళుతుంది. ప్రధానమంత్రి కార్యాలయం, డిఫెన్స్, సెక్యూరిటీ, వ్యవసాయం... సినిమాలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలిసిన ఒక వ్యక్తి రెబెల్ గా మారితే... అతను ఏం చేయగలడు? అతను ఎందుకు రెబెల్ గా మారాడు? అనేది సినిమాలో చూడండి. సినిమాలో చాలా చాలా కథలు ఉన్నాయి. సినిమాలో నేను మాత్రమే కాదు... మోహన్ లాల్ గారు, ఆర్య, బోమన్ ఇరానీ, కిరణ్ ఉన్నారు. అన్ని కథలు కూడా ఉన్నాయి. నాతో సన్నివేశాలకు మాత్రమే సాయేషా పరిమితం కాలేదు. కథను మార్చే పాత్రలో ఆమె కనిపిస్తుంది. ఇదొక ఆల్ రౌండ్ ఎంటర్టైనర్. కెవి ఆనంద్ గారితో నేను చేసిన మూడో సినిమా 'బందోబస్త్'. ఇందులో మోహన్ లాల్ గారితో పని చేయడం అమేజింగ్ ఎక్స్ పీరియన్స్ అని అన్నారు.

ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ గారు మాకోసం 'స్పైడర్'ను తమిళనాడులో విడుదల చేశారు. భారీ ఎత్తున విడుదల చేసి, మాకు బ్రహ్మాండమైన బిజినెస్ చేసి పెట్టారు. తెలుగు సినిమాకు అక్కడ మార్కెటింగ్ చేస్తే ఎంత రెవెన్యూ వస్తుందో... అంత చేశారు. వాళ్ల బ్యానర్ మాకు ఎంతో సపోర్ట్ చేసింది. అప్పటి నుండి వాళ్ల సినిమాలు అన్నిటినీ తెలుగులో నేను విడుదల చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుభాస్కరన్ గారికి, ఆయన టీమ్ కి నమస్కారం. చిన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరుకున్న సుభాస్కరన్ గారు, సినిమాలపై ప్రేమతో విదేశాల్లో ఉన్నప్పటికీ దక్షిణాదిలో చాలా కాస్ట్లీ సినిమాలు నిర్మిస్తున్నారు. అటువంటి బ్యానర్ పది కాలాల పాటు ఉండి, ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా. తమిళనాడులో టాప్ హీరోలు, టెక్నీషియన్లు ఈ బ్యానర్ లో చేశారంటే ఈ బ్యానర్ గొప్పతనం ఏంటో తెలుసుకోవచ్చు. 'బందోబస్త్' సూర్య కెరీర్లో బిగ్గెస్ట్ సినిమాగా నిలుస్తుంది. కెవి ఆనంద్ గారి 'రంగం'కు తిరుపతిలో నేను 100 రోజుల ఫంక్షన్ చేశాను. తమిళనాడులో ఆ సినిమాకు ఫంక్షన్ చేయలేదు. నేను మెగాస్టార్ చిరంజీవిగారిని ముఖ్య అతిథిగా తీసుకొచ్చి, ఫంక్షన్ చేశాను. సూర్య గారు, కెవి ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న ఈ 'బందోబస్త్'కు కచ్చితంగా 100 రోజుల ఫంక్షన్ చేయాలని, అంత పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఒక సెన్సేషనల్ హిట్ అయి సూర్యగారికి తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద మార్కెట్ ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

అతిథిగా హాజరైన నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ లైకా ప్రొడక్షన్ సంస్థ సూపర్ స్టార్స్, మహా నటులతో బందోబస్తుగా తీసిన సినిమా ఈ 'బందోబస్త్'. మా తిరుపతి ప్రసాద్ (ఎన్వీ ప్రసాద్) గారు విడుదల చేస్తున్నారు. సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

అతిథిగా హాజరైన 'జెర్సీ' దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ సూర్యగారిని ఈ రోజు కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఆయన నటనకు నేను పెద్ద అభిమానిని. 'కాకా కాకా' (తెలుగులో 'ఘర్షణ'గా వెంకటేష్ రీమేక్ చేశారు) ఇప్పటికీ నా ఫెవరెట్ ఫిల్మ్. 'బందోబస్త్' ఈ నెల 20న విడుదలవుతుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరికీ నా బెస్ట్ విషెస్. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు.

'బందోబస్త్' దర్శకుడు కెవి ఆనంద్ మాట్లాడుతూ సూర్యతో పని చేయడం గొప్ప ఫీలింగ్. ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే... మనం 50 పర్సెంట్ ప్లాన్ చేస్తే, ఆయన తన నటనతో, డ్యాన్సులతో, యాక్షన్ తో 100 పర్సెంట్ చేస్తారు. ఈ సినిమాకు గొప్ప గొప్ప నటులు నటులు దొరకడం నా అదృష్టం. మోహన్ లాల్ గారు ప్రధానమంత్రి పాత్రలో నటిస్తున్నారు. ఆర్య, సాయేషా మంచి క్యారెక్టర్స్ చేశారు. సినిమా బాగా వచ్చింది. మూడు రోజుల క్రితం మొత్తం సినిమాను చూశాను. హ్యారీస్ జైరాజ్ గారు మంచి పాటలు ఇచ్చారు. అంతకు మించి ఫెంటాస్టిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకు వెళ్లారు అని అన్నారు.

ఆర్య మాట్లాడుతూ సూర్యగారితో పని చేయడం గౌరవం. అదే విధంగా లెర్నింగ్ ప్రాసెస్. సూర్యగారు గ్రేట్ జెంటిల్ మన్. మీ అందరిలా నేనూ ఆయన్ను ప్రేమిస్తాను. ఈ సినిమాలో సూర్యగారితో కలిసి నటించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. 'బందోబస్త్' పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా అని అన్నారు.

సాయేషా సైగల్ మాట్లాడుతూ ఫస్ట్ టైమ్ సూర్యగారితో నటించాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి నటించాలనేది నా డ్రీమ్. సూర్యగారితో పని చేస్తుంటే మనమూ ఎక్కువ కష్టపడతాం. కళ్లలో వెయ్యి భావాలు పలికిస్తారు. నా క్యారెక్టర్ చాలా బావుంటుంది. కెవి ఆనంద్ గారు కేవలం పాటలు, డ్యాన్సుల కోసం హీరోయిన్ క్యారెక్టర్స్ రాయరు. కథలో వాళ్లకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్లకు నటించే అవకాశం దొరుకుతుంది. ఇంకా చాలా చేయవచ్చు. కెవి ఆనంద్ గారి దర్శకత్వం నటించడం నా అదృష్టం. నా క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయి. మిస్టీరియస్ క్యారెక్టర్. కథను ముందుకు తీసుకు వెళుతుంది. గొప్ప టీమ్ తో కలిసి చేసిన అద్భుతమైన సినిమా ఇది. మేమంతా సినిమా కోసం చాలా కష్టపడ్డాం. నెక్స్ట్ ఫ్రైడే... సెప్టెంబర్ 20న మీరందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడండి అని అన్నారు.

గేయ రచయిత వనమాలి మాట్లాడుతూ యాక్చువల్లీ... డబ్బింగ్ పాటలు అంటే చాలామందికి చులకన భావం ఉంటుంది. 'ఏముంటుంది? మాతృకలో ఉన్న భావాలను రాస్తారు' అని. కానీ, ఆ అభిప్రాయం తప్పు. నిజంగా స్ట్రయిట్ సాంగ్స్ రాయడం కంటే డబ్బింగ్ సాంగ్స్ రాయడం కష్టం. 'హ్యాపీ డేస్', 'ఆరెంజ్' నుండి నేను చాలా సినిమాల్లో స్ట్రయిట్ సాంగ్స్ రాశాను. కానీ, ఇటువంటి పాటలు రాసినప్పుడు... నిజంగా ఆ భావాన్ని తెలుగులో స్ట్రయిట్ సాంగ్స్ వలే రాయడానికి ఎంత కష్టపడ్డామనేది పాటలు వింటున్నప్పుడు తెలుస్తుంది. 'శివపుత్రుడు', 'రంగం'... చాలా సినిమాలకు నేను డబ్బింగ్ సాంగ్స్ రాశాను. ముఖ్యంగా డబ్బింగ్ సాంగ్స్ రాసేటప్పుడు మణిరత్నం, శంకర్ తర్వాత కేవీ ఆనంద్ గారికి భయపడతాను. మణిరత్నం, శంకర్ పాట రాసేటప్పుడు పక్కన కూర్చుని ప్రతి పదానికి మీనింగ్ తెలుసుకుంటారు. కేవీ ఆనంద్ గారు కూడా అంతే. 'రంగం' నుండి ఆయన ప్రతి సినిమాకు నాతో పాట రాయించుకుంటున్నారు. ఆయనతో పని చేయడం గొప్ప సంతృప్తి ఇచ్చింది. హ్యారిస్ జైరాజ్ గారు మంచి పాటలు ఇచ్చారు. పాటలతో పాటు సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నారు అని అన్నారు.

'బందోబస్త్' సినిమాటోగ్రాఫర్ ఎం.ఎస్. ప్రభు మాట్లాడుతూ నాకు చాలా పరిచయమైన హీరో సూర్య గారు. ఆయనకు నేను డైహార్డ్ ఫ్యాన్. మా కాంబినేషన్లో 'వీడోక్కడే' చేశాం. సూర్యగారి అభిమానుల కోలాహలం చూస్తుంటే సంతోషంగా ఉంది. 'బందోబస్త్' విడుదలైన తర్వాత థియేటర్లలో ఇదే విధమైన సపోర్ట్ ఇవ్వాలి. ఈ సినిమాను మీరందరూ పెద్ద హిట్ చేయాలి. కేవీ ఆనంద్ దర్శకుడి కంటే ముందు నా స్నేహితుడు. చిన్నప్పటి నుండి తెలుసు. మేం ఇద్దరం పీసీ శ్రీరామ్ గారి దగ్గర అసిస్టెంట్స్ గా చేశాం. సూర్య ఫస్ట్ సినిమాకు కేవీ ఆనంద్ సినిమాటోగ్రాఫర్. తర్వాత నేను చేశాను. ఇప్పుడు ఇద్దరం కలిసి పని చేశాం అని అన్నారు.

'బందోబస్త్' ఎడిటర్ ఆంటోనీ మాట్లాడుతూ ఈ సినిమాను ఫస్ట్ చూసింది నేనే. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ చాలా చాలా బాగా నటించారు. సూర్యగారు సూపర్ గా చేశారు

ఈ కార్యక్రమంలో నిర్మాతలు మల్కాపురం శివకుమార్, 'ఠాగూర్' మధు, నటులు రాజ్ కుమార్, రామదాస్, కిరణ్, లైకా ప్రొడక్షన్స్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుందర్ రాజన్, లైకా ప్రొడక్షన్స్ సంస్థకు సేల్స్ అండ్ మార్కెటింగ్ చెందిన శరన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

సూర్య సరసన సాయేషా సైగల్ నటిస్తున్న ఈ సినిమాలో భారత ప్రధానిగా మలయాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌, కీలక పాత్రలో ఆర్య నటిస్తున్నారు. బోమన్ ఇరానీ, ఆర్య, సాయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.