Bandla Ganesh:ప్రాణం పోయినా శత్రువుతో కలవను:చంద్రబాబు-విజయసాయిరెడ్డి కలయికపై బండ్ల గణేష్ ట్వీట్, ఏకేస్తున్న నెటిజన్లు

  • IndiaGlitz, [Monday,February 20 2023]

తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ మరోసారి పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార , ప్రతిపక్ష పార్టీలను బండ్లన్న కెలికాడు. దీంతో ఆ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఉతికి ఆరేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

సినీనటుడు నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కుప్పంలో గుండెపోటుకు గురైన ఆయన 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందారు. ఈ క్రమంలో గత శనివారం ఆరోగ్యం విషమించడంతో తారకరత్న కన్నుమూశారు. ఆయన అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమను, టీడీపీ శ్రేణులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న తారకరత్న చిన్న వయసులోనే దూరం కావడాన్ని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణవార్త తెలుసుకున్న ప్పటి నుంచి సినీ , రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నారు.

ఒకే కుర్చీలో కలిసి కూర్చొన్న చంద్రబాబు, విజయసాయిరెడ్డి:

ఇదిలావుండగా.. నిన్న తారకరత్న నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు చేరుకుని నివాళులర్పించారు. అయితే అంతకన్నా ముందే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అక్కడే వుండి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డిని, పిల్లలను ఓదార్చారు. ఈ క్రమంలో రాజకీయాల్లో సుదీర్ఘకాలం నుంచి బద్ధశత్రువుల్లా వుంటున్న విజయసాయిరెడ్డి, చంద్రబాబు నాయుడు పక్కపక్కన కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమైంది.

ప్రాణం పోయినా శత్రువుతో కలవను:

బద్ధశత్రువులు కలిసి మాట్లాడుకున్నారని.. దీనిని ఎవ్వరూ తప్పుబట్టలేదు. పైగా ఈ సన్నివేశం చూడటానికి ఎంతో బాగుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తారకరత్న మృతితో కష్టంలో వున్న ఆ కుటుంబానికి వీరిద్దరూ అండగా నిలిచారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే చంద్రబాబు, విజయసాయిరెడ్డిలు కలిసి కూర్చోవడం బండ్ల గణేష్‌కు నచ్చలేదు. దీంతో ఆయన ట్విట్టర్‌కు పని చెప్పారు. ‘‘నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం.
అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి ’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఉమ్మడిగా ఏకేస్తున్న టీడీపీ, వైసీపీ, నందమూరి ఫ్యాన్స్:

ఇది కాస్తా వైరల్ కావడంతో టీడీపీ, వైసీపీ, నందమూరి అభిమానులూ ఏకతాటిపైకి వచ్చి మూకుమ్మడిగా బండ్లన్నను తగులుకున్నారు. అక్కడి సందర్భం ఏంటి.. నీ ట్వీట్ ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో వున్నప్పుడు రాజకీయాలు పక్కనబెట్టి కలవడంలో తప్పేముంది.. ముందు మనమంతా మనుషులం అన్నా అంటూ చురకలంటిస్తున్నారు. రాజకీయాల్లో సైద్ధాంతికంగా విభేదాలు వుండొచ్చు కానీ.. వ్యక్తిగతంగా కాదని , ముందు నీ పిచ్చి ట్వీట్లు ఆపాలంటూ దుయ్యబడుతున్నారు.