ఏపీ ఎన్నికల్లో నా దైవాన్ని గెలిపించండి!

  • IndiaGlitz, [Thursday,April 04 2019]

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేశ్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు భక్తుడన్న విషయం తెలిసిందే. అయితే ఇది సినిమాల వరకే అని రాజకీయాల పరంగా ఎవరి దారి వాళ్లదంటూ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

అప్పుడెప్పుడో తెలంగాణలో కాంగ్రెస్‌ గెలవకపోతే బ్లేడ్‌తో పీక కోసుకుంటానని చెప్పి.. ఓడిపోయాక అడ్రస్ లేకుండా పోయిన బండ్ల తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా హడావుడి చేశారు. వచ్చీరాగానే పవన్‌కు తాను భక్తుడినన్న విషయం మరోసారి నిరూపించుకున్నారు.

బండ్ల ట్వీట్ సందేశం..

నిజాయతీకి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు... నా దైవం, నా బాస్.. పవన్ కల్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని ఏపీ ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి.. ఇట్లు మీ బండ్ల గణేష్’ అని ఆయన ట్వీట్ చేశారు.

బండ్ల ట్వీట్‌కు పలువురు మెగాభిమానులు పాజిటివ్‌గా కామెంట్లు చేస్తుండగా మరికొందరు నెటిజన్లు మాత్రం బ్లేడ్ మళ్లీ వచ్చిందిరో.. అంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే త్వరలో జరగనున్న ఈ ఎన్నికల్లో పవన్ పరిస్థితి ఎలా ఉంటుందో.. ఎన్ని సీట్లు వస్తాయో తెలియాంటే మే-23 వరకు వేచి చూడాల్సిందే మరి.