బ్లేడ్ రాజా ‘బండ్ల’ మళ్లీ వచ్చాడు.. జగన్ నిద్రలేవాలి!!
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఆంధ్రా.. బీహార్‌లా తయారైంది.. జగన్ నిద్రలేవాలి’ అని వైసీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించింది ఎవరో కాదు.. ఒకప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ కాంగ్రెస్‌లో చేరి.. బ్లేడ్‌తో కోసుకుంటానని చెప్పి హడావుడి చేసి.. ఆ తర్వాత రాజకీయాలకి శాశ్వతంగా దూరమైన బండ్ల గణేష్. తనను ఎవరూ పట్టించుకోవట్లేదని అనుకుని మీడియా ముందుకు వచ్చారో.. లేకుంటే అందరూ మాట్లాడుతున్నారు కదా.. నేనేమీ మాట్లాడకుంటే బాగోదని ఉనికి కోసం మాట్లాడారో ఆయనకే తెలియాలి కానీ.. తాజా వ్యాఖ్యలతో మాత్రం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు.
ఏపీ పరువు గంగలో కలిసిపోయింది!
ఏపీలో ‘పల్నాడు గొడవలు’ జరుగుతుండగా.. పోటా పోటీగా వైసీపీ-టీడీపీ పార్టీలు ‘ఛలో ఆత్మకూరు’ను నిర్వహించడం.. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు కీలకనేతలను హౌస్ అరెస్ట్ చేసి.. పరిస్థితులను పోలీసులు అదుపులోకి తెచ్చారు. అయితే తాజా పరిణామాలపై బండ్ల గణేష్ స్పందించిన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పల్నాడు గొడవలతో ఏపీ పరువు గంగలో కలిసిపోయిందన్నారు. అంతటితో ఆగని ఆయన.. ఆంధ్రా మరో బీహార్‌లా తయారైందని వ్యాఖ్యలు చేశారు.
మీకు సాయం చేసే స్థితిలో నేను లేను!
‘పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలను అటకెక్కించారు. రాజధానిగా అమరావతి ఉంటుందో ఊడుతుందో తెలియక ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా పని చేస్తే రాష్ట్రానికి మంచిది. వందరోజుల పాలనలో ఏమీ చెయ్యనీ సీఎం జగన్ నిద్రలేవాలి. ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి. జెండా, అజెండా లేని నాయకులు కొంత కాలం రెస్ట్ తీసుకుంటే మంచిది. దగాపడ్డ తెలుగు ప్రజలారా!.. ఏ నాయకుడిని నమ్మొద్దు, మీకు సాయం చేసే స్థితిలో నేను లేను.. మనందరినీ ఆ భగవంతుడే కాపాడాలి. భావితరాలకు ఆయనే (భగవంతుడే) దిక్కు’ అని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.
ఇంతకీ ఎవర్ని ఉద్దేశించి!
జెండా, అజెండా లేని నాయకులు కొంత కాలం రెస్ట్ తీసుకుంటే మంచిదనే వ్యాఖ్యలు బండ్ల ఎవర్ని ఉద్దేశించి అన్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్దేశించి అన్నారా ..? లేకుంటే పవన్‌ను ఉద్దేశించి అన్నారా..? అనేది ఆయన తెలియాలి మరి. మొత్తానికి చూస్తే తాను ఉన్నాను.. అని జనాలకు గుర్తు చేసుకోవడానికి బండ్ల ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments