పవన్‌తో బండి సంజయ్ భేటీ.. ఏమేం చర్చించారు!?
- IndiaGlitz, [Monday,May 25 2020]
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బండి సంజయ్ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ.. పార్టీని బలోపేతం చేయడానికి సాయశక్తులా బండి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి భాగస్వామి అయిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో బండి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఉన్న వ్యక్తిగత కార్యాలయంలో పవన్‌తో బండి సమావేశమయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిణామాలపై నిశితంగా చర్చించారు. మరీ ముఖ్యంగా టీటీడీ భూముల వ్యవహారంపై నిశితంగా చర్చించారని.. జూన్ మాసంలో ఇరువురూ కలిసి ఢిల్లీకెళ్లి పెద్దలను కలిసి ఫిర్యాదులు చేయబోతున్నట్లు తెలియవచ్చింది. అలాగే తెలంగాణలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపైనా ఈ భేటీలో చర్చించారని తెలియవచ్చింది.
భేటీ వెనుక..!
కాగా.. పవన్‌ను.. బండి సంజయ్ కలవడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో ఇరు పార్టీలు సంయుక్త కార్యాచరణతో ముందుకు కదిలే అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. కాగా.. జనసేన, బీజేపీ వర్గాలు మాత్రం ఈ భేటీని మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమే అని అభివర్ణిస్తున్నాయి. దీనిపై బండి సంజయ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. తాజా పరిణామాలపై పవన్‌ను కలిసి చర్చించానని మాత్రమే వెల్లడించారు. ఇదిలా ఉంటే.. పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్నికలతో పాటు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లోనూ కలిసి పనిచేస్తామని ఇది వరకే ఇరు పార్టీల నేతలు చెప్పిన విషయం విదితమే.