Petrol in Bottles: బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలు నిషేధం.. ఈసీ కీలక ఆదేశాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరగకుండా నిషేధం విధించింది. ఈ మేరకు పెట్రోల్ బంకుల నిర్వాహకులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా కీలక ఆదేశాలు జారీ చేసింది. బాటిళ్లు, క్యాన్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాలకు మాత్రమే ఇంధనం నింపాలని పేర్కొంది. నిబంధనలు అతిక్రమిస్తే పెట్రోల్ బంకుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఇటీవల పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకోవటంపై ఈసీ సీరియస్ అయింది. అలాగే ఓ రాజకీయ నేత ఇంట్లో భారీగా పెట్రోల్ బాంబులు దొరకడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు తలెత్తే అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా ఈ ఆదేశాలు జారీచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈసీ ఆదేశాలపై ఇంధన డీలర్ల సమాఖ్య సానుకూలంగా స్పందించింది. ఈసీ ఆదేశాలను పెట్రోల్ బంకుల నిర్వాహకులు విధిగా అమలు చేయాలని కోరింది.
కాగా పోలింగ్ సందర్భంగా పల్నాడు, తాడిపత్రి, చంద్రగిరి, చీరాల, అనంతపురం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో హింస చెలరేగింది. రాష్ట్రంలో ఐజీలు, ఎస్పీలు, సిఐలు మార్చిన చోట హింస చెలరేగింది. ఓవైపు టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా.. మరోవైపు వైసీపీ నేతలు ఓటమి భయంతో హింసకు తెరలేపారని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో పోలింగ్ అయినా కానీ పరిస్థితులు మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే లోపు ఎలాంటి పరిస్థితులు తలెత్తనున్నాయో అనే ఆందోళనలో సామాన్య ప్రజలు ఉన్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 144 సెక్షన్ పెట్టింది. అంతేకాకుండా పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలను సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్‌పై బదిలీ వేటు వేసింది. వీరితో పాటు ఈ మూడు జిల్లాల్లో 12 మంది కిందిస్థాయి పోలీస్ సిబ్బందిని కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ఏర్పడిన సిట్ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. రెండు రోజుల్లో నివేదిక సిద్ధం చేసి ఈసీకి వివరించనుంది. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments