క్రాకర్స్‌పై నిషేధం... కేవలం రెండు రోజుల ముందా?

  • IndiaGlitz, [Thursday,November 12 2020]

దీపావళి పండుగపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పండుగ సందర్భంగా టపాసులను బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీపావళి పండుగలో క్రాకర్స్ పేల్చకుండా ఆదేశాలివ్వాలంటూ ఇంద్ర ప్రకాష్ అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా ఉన్నాయని ఆ సమయంలో క్రాకర్స్ కాల్చడం వలన ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. క్రాకర్స్ కారణంగా ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులు పడతారని పిటిషనర్ తెలిపారు. పిటిషనర్ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఇప్పటివ వరకూ తెరిచిన షాపులన్నింటినీ మూసి వేయాలని తెలిపింది.

ఇప్పటికే రాజస్థాన్, కోల్‌కత్తాలో కూడా క్రాకర్స్‌ను బ్యాన్ చేయాలని ఆయా కోర్టులు ఆదేశాలు జారీ చేశాయని.. తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. ఆ విధంగానే తెలంగాణలో కూడా క్రాకర్స్‌ను బ్యాన్ చేయాలని హైకోర్టు తెలిపింది. ఎవరూ క్రాకర్స్ అమ్మడం గాని , కొనడం గాని చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఎవరైనా కోర్టు ఆదేశాలను మీరి అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని హైకోర్టు తెలిపింది. ఈ నెల 19 న ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశాలు జారీ చేసింది. ప్రసార మాద్యమాల ద్వారా క్రాకర్స్ కాల్చకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు అదేశాలు జారీ చేసింది.

రెండు రోజుల ముందు ఇలాంటి ఆదేశాలా?

దీపావళి పండుగకు కేవలం రెండు రోజుల ముందు హైకోర్టు ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం పట్ల ప్రజల నుంచి ముఖ్యంగా చిరు వ్యాపారుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా కొన్ని నెలలుగా జీవనోపాధి లేక సామాన్యులకు పూట గడవడం కష్టంగా మారిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఏదో కాస్త క్రాకర్స్ అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని గడుపుదామని భావించిన చిరు వ్యాపారులకు ఇలాంటి ఆర్డర్స్ ఈ సమయంలో ఇస్తే పరిస్థితి ఏంటి? రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ముందే ఆదేశాలు రావడంతో వ్యాపారులు ఆ దిశగా ఆలోచన కూడా చేయలేదు. కానీ తెలంగాణలో అలాంటి ఆర్డర్స్ ఏమీ నేటి మధ్యాహ్నం వరకూ లేవు. దీంతో అప్పో సప్పో చేసి బాణాసంచా దుకాణాలు పెట్టుకున్న వారి పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇవాళ, రేపే పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. మరి అంత పెట్టుబడి దుకాణాలు పెట్టుకున్న తాము ఏమై పోవాలని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.