'చినబాబు'కి బాలు డ‌బ్బింగ్ చెప్పారా?

  • IndiaGlitz, [Wednesday,June 06 2018]

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.. పరిచయం అక్కరలేని పేరు. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని దాదాపు అన్ని భాషల్లోనూ పాట‌లు పాడి.. తన గాత్ర మాధుర్యాన్ని దేశమంతటా శ్రోతలకు పంచిన అపూర్వ గాయకుడాయ‌న‌. సాధారణంగా.. బాలసుబ్రహ్మణ్యం పేరు చెబితే గాయకుడు మాత్రమే గుర్తుకు వస్తారు. నిజానికి ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, న‌టుడిగా.. ఇలా ప‌లు విభాగాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు.

ఇదిలా ఉంటే.. ‘ఆనంద భైరవి’ (1983) సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రయాణం ప్రారంభించిన బాలు.. అనంతరం ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఆ విభాగంలోనూ ప‌లు పుర‌స్కారాలు సొంతం చేసుకున్నారు. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల గ‌త కొంత‌ కాలంగా డబ్బింగ్‌కు దూరంగా ఉన్న బాలు.. కార్తి హీరోగా నటించిన తమిళ అనువాద చిత్రం ‘చినబాబు’ కోసం తన గళాన్ని సవరించుకున్నారు. ఇందులో క‌థానాయ‌కుడి తండ్రి పాత్రను సత్యరాజ్ పోషించారు. సత్యరాజ్ పోషించిన ఆ పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పారట‌ బాలు. ఇంతకాలం డబ్బింగ్‌కు దూరంగా ఉన్న బాలు.. ఇప్పుడు డబ్బింగ్ చెప్పడం వెనక ఉన్న కార‌ణం సత్యరాజ్ పాత్ర బాగా నచ్చడమే అని అంటున్నాయి చిత్ర వ‌ర్గాలు.