బాలు, నేనూ శ్రీకాళహస్తిలో చదివాం.. రూ.100 తీసుకున్నా: మోహన్‌బాబు
Send us your feedback to audioarticles@vaarta.com
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నేడు పరమపదించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రముఖులంతా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మంచు మోహన్‌బాబు కూడా బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తామిద్దరం కలిసి శ్రీకాళహస్తిలో కొన్నాళ్లు చదువుకున్నామని మోహన్‌బాబు తెలిపారు. అప్పటి నుంచి తమ స్నేహం కొనసాగించదని వెల్లడించారు. ఈ మధ్య కూడా తామిద్దరం కలిసి ఫోన్లో కొద్దిసేపు ముచ్చటించుకున్నామని తెలిపారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సమయంలో బాలు వద్దకు వెళ్లి రూ.100 రూపాయలు తీసుకున్నానని మోహన్‌బాబు వెల్లడించారు.
"నాకు అత్యంత ఆత్మీయుడు, ఆప్తమిత్రుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు. మేమిద్దరం కలిసి శ్రీకాళహస్తిలో కొన్నాళ్లు చదువుకున్నాం. అప్పట్నుంచే మేం మంచి ఫ్రెండ్స్. చాలా కలివిడిగా ఉండేవాళ్లం. కాలక్రమంలో ఇద్దరం సినీ రంగంలో అడుగుపెట్టాం. ఆయన గాయకుడైతే, నేను నటుడినయ్యాను. శ్రీకాళహస్తిలో మొదలైన మా స్నేహం, ఆత్మీయత చెన్నైలోనూ కొనసాగింది. శ్రీవిద్యా నికేతన్‌లో ఏ కార్యక్రమం జరిగినా బాలు రావాల్సిందే. గత మార్చి 19 నా పుట్టినరోజున శ్రీవిద్యా నికేతన్ వార్షికోత్సవానికి కూడా ఆయన హాజరు కావాల్సింది. కరోనా మహమ్మారి కారణంగా ఆ కార్యక్రమం క్యాన్సిల్ కావడంతో రాలేకపోయారు.
ఈమధ్య కూడా ఫోన్లో ఇద్దరం కొద్దిసేపు ముచ్చటించుకున్నాం. ఆయన ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు. అన్ని దేవుళ్ల పాటలు పాడి ఆ దేవుళ్లనందరినీ మెప్పించిన గాన గంధర్వుడు. ఏ దేవుడి పాట పాడితే ఆ దేవుడు మన ముందు ప్రత్యక్షమైనట్లే ఉంటుంది. అలాంటి దిగ్గజ గాయకుడిని కోల్పోవడం యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీకే కాదు, యావత్ దేశానికీ ఎంతో బాధాకరం. నాకు వ్యక్తిగతంగా ఎంతో లోటు. నా సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. నా చెవుల్లో ఆయన పాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. నా హృదయంలో ఆయన ఎప్పుడూ ఉంటారు. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలనిపిస్తోంది.
నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే కాలంలో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాను. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం దగ్గరకు వెళ్లి వంద రూపాయలు అడిగి తీసుకున్నాను. మేం కలుసుకున్నప్పుడల్లా ఇప్పటికీ ఆ వంద రూపాయల విషయం ప్రస్తావించి, 'వడ్డీతో కలిపి ఇప్పుడది ఎంతవుతుందో తెలుసా! వడ్డీతో సహా నా డబ్బులు నాకు ఇచ్చేయ్.' అని సరదాగా ఆటపట్టించేవారు. మా మధ్య అంతటి స్నేహం, సన్నిహితత్వం ఉంది. అలాంటి మంచి స్నేహితుడ్ని కోల్పోయాను. మనిషనేవాడికి ఎప్పుడు, ఎక్కడ, ఎలా అవుతుందనే తెలీదు. బాలు మరణం నన్నెంతో బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout