Balayya, Ntr:ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలయ్య, జూ.ఎన్టీఆర్ నివాళులు.. విభేదాలు బహిర్గతం..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ప్రతి ఊరు-వాడలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు చేసి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ముందుగా ఇవాళ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ చేరుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న అభిమానులు ఎన్టీఆర్ సీఎం.. సీఎం ఎన్టీఆర్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అనంతరం నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. తన కుటుంబసభ్యులు నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులతో అంజటి ఘటించారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడుతూ "ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించడానికి వచ్చాం. ఒక పరమార్థం కోసం, సమాజాన్ని ఉద్ధరించడం కోసం కొందరు పుడతారు.. వారికి మరణం ఉండదు.. అలాంటి వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఒకరు.. ఆయన జీవన విధానమే భగవంతుడి మార్గం. అన్ని వర్గాలకు ఆయన దేవుడు.. యన రగిలే ఒక అగ్నికణం. మహనీయమైన జన్మను పొందిన ఎన్టీఆర్‌కు మరణం లేదు. నటుడిగా అనితరసాధ్యమైన ఎన్నో పాత్రలను పోషించారు. అలాంటి నటధీరుడు ఎక్కడా కానరాడు. సినిమాలే కాకుండా.. బడుగు, బలహీన వర్గాల కోసం టీడీపీని స్థాపించి, ప్రతి తెలుగు బిడ్డకు రాజకీయాలంటే ఏమిటో నేర్పిన మహానాయకుడు.
ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఇప్పటికీ ఎందరో అమలు చేస్తున్నారు. ప్రజలకు అన్నం పెట్టిన నాన్న, ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించిన అన్న, యువత జీవితాలలో వెలుగులు నింపిన నాన్న ఎన్టీఆర్.. తెలంగాణలో పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం, తాలూకాలను మండలాలుగా చేయడం, సహకార వ్యవస్థ ద్వారా రైతులకు మేలు చేయడం, మహిళా విశ్వవిద్యాలయం, గురుకుల విద్యా విధానం, సంక్షేమ హాస్టళ్లు, జోగిని, దేవదాసి వ్యవస్థలను రద్దు చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి" అని బాలయ్య కొనియాడారు.
అయితే ఎన్టీఆర్ ఘాట్ వద్ద మరోసారి నందమూరి కటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. తెల్లవారుజామున జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులర్పించేందుకు వచ్చిన సమయంలో అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అయితే బాలయ్య రాగానే జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసివేశారు. దీంతో వారి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కొంతకాలంగా నందమూరి, నారా కుటుంబాలకు తారక్, కల్యాణ్ రామ్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇద్దరు కనీసం తమ స్పందన తెలియజేయలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments