70 వసంతాల 'బాలరాజు'
Send us your feedback to audioarticles@vaarta.com
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ను మలుపు తిప్పిన చిత్రాలలో 'బాలరాజు' ఒకటి. నటుడిగా ఆయనకు ఏడవ చిత్రమిది. ఎస్.వరలక్ష్మి, అంజలీ దేవి, కస్తూరి శివరావు ఇతర ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ అద్భుత ప్రేమకావ్యాన్ని.. ఘంటసాల బలరామయ్య స్వీయ దర్శకత్వంలో రూపొందించారు.
అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచి.. మొదటి తెలుగు సిల్వర్ జూబ్లీ మూవీగా ఘనతను సాధించింది ఈ సినిమా. సి.ఆర్.సుబ్బరామన్ (నేపథ్య సంగీతం), గాలిపెంచల నరసింహారావు, ఘంటసాల సంయుక్తంగా సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ శ్రోతలను అలరించాయి.
ఈ ప్రేమకథలోకి ఒకసారి వెళితే.. దేవేంద్రుడు, దేవకన్య మోహిని(అంజలి దేవి)ని మోహిస్తాడు. కాని అప్పటికే మోహిని, యక్షుడు (నాగేశ్వరరావు) ప్రేమించుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న దేవేంద్రుడు వారిని విడదీసే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలో కుబేరుడు, దేవేంద్రుడు మోహినీయక్షులను మానవులుగా జన్మించి.. ప్రేమ కోసం పరితపించేలా జీవించమని శపిస్తారు.
శాప ప్రభావం వల్ల.. భూలోకంలో బాలరాజు (నాగేశ్వరరావు)గా యక్షుడు, సీత (ఎస్.వరలక్ష్మి)గా మోహిని మానవులుగా జన్మిస్తారు. ప్రేమ కోసం పరితపిస్తూ ఎన్నో కష్టాలు పడుతున్న వీరిని చూసి.. ఆఖరికి దేవతలు కూడా చలించిపోయి.. శాపవిమోచనం చేసి దేవలోకానికి రమ్మంటే.. మానవులుగానే భూలోకంలో ఉండిపోవడానికి వీరు ఇష్టపడతారు.
దీంతో కథ సుఖాంతం అవుతుంది. ప్రయాగ రచించిన ఈ కథకి సీనియర్ సముద్రాల అందించిన మాటలు, స్క్రీన్ ప్లే అద్భుతమనే చెప్పాలి.11 కేంద్రాలలో శతదినోత్సవాన్ని జరుపుకున్న 'బాలరాజు'.. 1948లో ఇదే ఫిబ్రవరి 26న విడుదలైంది. అంటే.. నేటితో ఈ చిత్రం రిలీజై 70 వసంతాలను పూర్తిచేసుకుంటుందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments