Balapur Laddu Auction: బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం.. పాత రికార్డులన్నీ బ్రేక్, ఎంతో తెలుసా.??
- IndiaGlitz, [Friday,September 09 2022]
హైదరాబాద్‌లో గణేశ్ శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది. ఈ క్రమంలో భాగ్యనగరానికే ప్రత్యేకమైన బాలాపూర్ లడ్డూకి వేలంలో రికార్డు ధర దక్కింది. శుక్రవారం జరిగిన వేలం పాటలో రూ.24.60 లక్షలకు బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ.18.90 లక్షలు పలకగా.. ఈ ఏడాది మరో 5.70 లక్షలు అధికంగా పలికింది.
వేలం కోసం తరలివచ్చిన మంత్రులు, ప్రముఖులు:
ఈ ఏడాది లడ్డూ వేలం పాటలో 13 మంది పాత సభ్యులు, 8 మంది కొత్తవారు పాల్గొన్నారు. రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వేలం పాటలో పాల్గొన్నారు. స్వయంగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం వేలానికి హాజరయ్యారు. గణేశుడి లడ్డూని దక్కించుకోవడం పట్ల వంగేటి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మూడు రోజులు తమ ఇంట్లో పూజలు నిర్వహించిన అనంతరం బంధువులు, మిత్రులకు లడ్డూ ప్రసాదాన్ని పంచుతానని లక్ష్మారెడ్డి తెలిపారు.
1994లో లడ్డూ ధర రూ.450
ఇకపోతే.. 2019లో బాలాపూర్ లడ్డూ రూ.17.60 లక్షల పలకగా.. 2020లో కోవిడ్ కారణంగా వేలం పాట జరగలేదు. దానిని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా అందజేశారు. మళ్లీ 2021లో రూ.18.90 లక్షలు పలకగా.. మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్‌లు వేలంలో లడ్డూని దక్కించుకున్నారు. 1994లో తొలిసారి బాలాపూర్ గణేశ్ లడ్డూని వేలం వేశారు. ఆ ఏడాది రూ.450కి కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తి దానిని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 1995, 98, 2004, 2008లలో ఆయనే దక్కించుకున్నారు.