టీడీపీ పగ్గాలు చంద్రబాబుకు ఎందుకిచ్చావ్ - బాలయ్యకు మోహన్ బాబు సూటి ప్రశ్న

  • IndiaGlitz, [Sunday,October 31 2021]

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ యాజమాన్యంలో వున్న ‘‘ఆహా’’ యాప్‌లో 'అన్ స్టాపబుల్' with NBK షొకు బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన్ను చాలామంది ఎన్నో సందర్భాల్లో ఇంటర్వ్యూ చేశారు. అయితే... బాలకృష్ణ స్వయంగా సెలబ్రిటీలను ఎలా ఇంటర్వ్యూ చేస్తారోననే ఆసక్తి అందరిలో నెలకొంది. ఆ ఆసక్తికి తెర దించుతూ ఈ రోజు (ఆదివారం) తొలి ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు.

తొలి ఎపిసోడ్‌కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన తనయుడు విష్ణు మంచు, కుమార్తె లక్ష్మీ మంచు అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా పెదరాయుడుతో బాలయ్య ఆటలు ఆడించారు. అయితే సినిమా సంగతులు మాత్రమే కాకుండా.. రాజకీయాలు కూడా బాలకృష్ణ, మోహన్ బాబు మధ్య చర్చకు వచ్చాయి. ‘‘ నిన్నొక విషయం అడుగుతా... తెలుగుదేశం స్థాపించినది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన తదనంతరం ఆ పగ్గాలు మీరు చేతిలోకి తీసుకోకుండా... చంద్రబాబుకు ఎందుకిచ్చావ్? అని బాలకృష్ణను మోహన్ బాబు నిలదీశారు. ఆ వెంటనే 'ఆ ఒక్కటీ...' అని బాలకృష్ణ వేలు చూపించారు. అయితే ఏమాత్రం తడుముకోకుండా అన్నగారి పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చింది? అని బాలకృష్ణ కూడా మోహన్ బాబును ప్రశ్నించారు. మరి వీరిద్దరూ ఒకరికొకరు ఏం సమాధానం చెప్పుకున్నరనేది తెలియాలంటే దీపావళి వరకు వెయిట్ చేయాల్సిందే.