త్వరలో కేసీఆర్‌ను కలవనున్న బాలయ్య..!?

  • IndiaGlitz, [Friday,June 05 2020]

టాలీవుడ్ గత కొన్ని రోజులుగా నటుడు కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా నిలిచిన విషయం విదితమే. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన భేటీ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశానికి తనను పిలవలేదని బాలయ్య బూతులు మాట్లాడిన వ్యవహారం అందరికీ తెలిసిందే. తనను ఎవరూ పట్టించుకోలేదని ఆ తర్వాత కూడా పలు ఇంటర్వ్యూల్లో ఆయన మరోసారి చెప్పుకొచ్చారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు సీఎం కేసీఆర్‌ను బాలయ్య కలవబోతున్నారట. ఇండస్ట్రీ గ్రూపులు అనేవి ఉండకూడదని అందరూ కలిసి కట్టుగా ఉంటేనే టాలీవుడ్ అభివృద్ధి సాధ్యమని భావించిన కేసీఆర్ బాలయ్యకు కబురు పంపారట. దీంతో త్వరలోనే ప్రగతి భవన్‌ వేదికగా ఈ ఇద్దరి భేటీ జరగనుంది. ఈ భేటీకి బాలయ్యకు దగ్గరగా ఉండే కొందరు దర్శకనిర్మాతలు హాజరవుతారని తెలియవచ్చింది. ఇప్పటికే అపాయింట్మెంట్ ఖరారు అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ ఈ భేటీనే నిజమైతే బాలయ్య ఏం మాట్లాడతారు..? ఇండస్ట్రీలో ఏమేం జరుగుతోంది..? ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది..? ఆ భూముల పంచాయితీ ఏంటి..? అసలు చిరంజీవిపై కేసీఆర్‌కు ఏమేం ఫిర్యాదు చేస్తారు..? మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌పై ముఖ్యమంత్రికి ఏం చెప్పనున్నారు..? అనేదానిపై అటు టాలీవుడ్‌లో.. ఇటు రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇలా అన్ని విషయాలపై మాట్లాడటానికి సిద్ధంగా బాలయ్య సిద్ధమయ్యారని టాక్ నడుస్తోంది. మొత్తానికి చూస్తే ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకోబోతోంది. మరి దీనిపై బాలయ్య, సీఎంవో వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో వేచి చూడాలి.