498 ఎకరాల రాజధాని భూమిపై బాలయ్య చిన్నల్లుడు క్లారిటీ
- IndiaGlitz, [Wednesday,August 28 2019]
అమరావతికి 120 కి.మీ దూరంలో నాటి సీఎం చంద్రబాబు వియ్యంకుడి.. వియ్యంకుడికి 498.39 ఎకరాల భూమి ధారాదత్తం చేశారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. అంటే ఆ వియ్యంకుడు వియ్యంకుడు ఎవరో కాదు.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్. అయితే తాజాగా ఈ భూముల వ్యవహారంపై మీడియా ముందుకు వచ్చిన ఆయన.. మంత్రి వ్యాఖ్యలకు స్పందించారు.
బాలయ్య చిన్నల్లుడు ఏమంటున్నారు!?
అమరావతిపై బురదజల్లడానికి నన్ను పావుగా వాడుకుంటున్నారు. చంద్రబాబుపై బురదజల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. బొత్స అసత్య వ్యాఖ్యలు చేశారు. జగ్గయ్యపేటలో గ్యాస్ బేస్ ఫెర్టిలైజర్ ఫ్లాట్‌కోసం 498 ఎకరాలు కోరాం. ఇప్పటికీ ఆ భూమి ప్రభుత్వం ఆధీనంలో ఉంది. మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలోనే జాయింట్ వెంచర్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. 2014లో వీవీఐఐపీ భూమి ధరలు రూ. 13లక్షలకు పెంచింది. అప్పటి ప్రభుత్వ నిర్ణయాలు మంత్రిగా ఉన్న బొత్సకు తెలుసు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది. నన్ను పావుగా చూపి రాజధాని రైతులకు అన్యాయం చేయవద్దు. ఎన్నికల్లో ఆరోపణలు చేసినా ఉరుకున్నా కానీ ఎన్నికల తర్వాత కూడా నాపై బురదజల్లడం సరికాదు. ఉద్దేశపూర్వకంగా రక్షణ స్టీల్ స్థలంపై హైకోర్టుకు వెళ్లారు. బొత్స చూపించిన కాపీలు 2012లో ఇచ్చిన జీవో. నా పెళ్లికి ముందు జరిగిన వ్యవహారాన్ని తర్వాత పరిణామాలకు ముడి పెడుతున్నారు అని శ్రీభరత్ చెప్పుకొచ్చారు. కాగా విశాఖపట్నం నుంచి భరత్ టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన విషయం విదితమే. అయితే ఈ వ్యాఖ్యలకు మంత్రి బొత్స, వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.