Balakrishna:ఇక యుద్ధం మొదలైంది.. పవన్ కల్యాణ్‌పై బాలకృష్ణ ప్రశంసలు
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. తాను, పవన్ కల్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడే మనుషులమని తెలిపారు. ఎవరికీ భయపడని వ్యక్తిత్వం తమదని పేర్కొ్న్నారు. రాక్షసుడితో చేస్తున్న యుద్ధంలో పవన్ తమతో కలిసి రావడం శుభపరిణామని కొనియాడారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్వహించిన టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో బాలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన, టీడీపీ కలయిక కొత్త శకానికి నాంది పలికినట్టేనని పేర్కొన్నారు. ప్రజలకు తెలుగు తమ్ముళ్లు, జనసైనికులం రక్షకభటులుగా ఉంటామని హామీ ఇచ్చారు.
వైసీపీ సామాజిక సాధికార బస్సుయాత్రలో మహానీయుల ఫొటోలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర పాలన నేరస్థుల చేతుల్లోకి వెళ్లకూడదన్నదే తమ ఉద్దేశం అన్నారు. సీఎం జగన్ సహా వైసీపీ వారంతా ఆవు తోలు కప్పుకున్న పులులు అని విమర్శించారు. భవిష్యత్‌లో జరగబోయేది ఉద్యమమేనని.. ప్రజలంతా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని.. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయని మండిపడ్డారు. అమరావతి ఉద్యమకారులను పెయిడ్ ఆర్టిస్టులు అన్నారని అసలైన పెయిడ్ ఆర్టిస్టులు విశాఖ సమ్మిట్‌లో పాల్గొన్న వారేనని చెప్పారు.
హిందూపురంలో వైసీపీ ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని.. తన సొంత నిధులు, పార్టీ నిధులతో అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, జనసేన కలిసికట్టుగా పనిచేస్తాయని బాలయ్య వెల్లడించారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ముఖ్యం కాదని.. రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. చివరగా జై టీడీపీ.. జై జనసేన అంటూ ప్రసంగాన్ని ముగించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com