నాన్న గారే స్పూర్తి....ఆ విషయంలో 1% కూడా భయపడలేదు - బాలకృష్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడుగా నట ప్రస్ధానం ప్రారంభించి...పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్...ఇలా పవర్ ఫుల్ రోల్స్ పోషించిన నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై జాగర్లమూడి క్రిష్ ఈ భారీ చిత్రాన్నితెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా గౌతమీపుత్ర శాతకర్ణి గురించి బాలకృష్ణతో ఇంటర్ వ్యూ మీకోసం...!
మీ 100వ చిత్రంగా గౌతమీపుత్ర శాతకర్ణి కథను ఎంచుకోవడానికి కారణం..?
నాన్నగారు ఈ పాత్ర చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు. రాష్ట్రాలన్నింటిని కలిసి విశాల దేశంగా ఏకతాటి పైకి తీసుకువచ్చింది గౌతమీపుత్ర శాతకర్ణి. అతను మన తెలుగువాడు.ఈ కథ చెప్పినప్పుడు వెంటనే చేయాలి అనిపించింది. నాకు ఈ పాత్ర పోషించే అవకాశం రావడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. 100వ సినిమాను ఏకథతో చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఈ కథ నా దగ్గరకు రావడం...నాన్నగారు చేయాలనుకున్న పాత్ర కావడం ఇదంతా యాధృచ్చికంగా జరిగింది.
గౌతమీపుత్ర శాతకర్ణి గురించి సమాచారాన్ని ఎలా సేకరించారు..?
గౌతమీపుత్ర శాతకర్ణి గురించి చాలా తక్కువ సమాచారం లభించింది. పరబ్రహ్మా శాస్త్రి గారు, కృష్ణ శాస్త్రి గారు కొంత సమాచారాన్ని అందించారు. ఇన్ ఫర్మేషన్ తక్కువే ఉన్నప్పటికీ డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.
సినిమాను మీరు చూసుంటారు కదా..! ఫైనల్ గా సినిమాని చూసినప్పుడు ఏమనిపించింది..?
అనిర్వచనీయమైన అనుభూతి. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులుకు కూడా అదే అనుభూతి కలుగుతుంది అనుకుంటున్నాను.
తక్కువ టైమ్ లోనే ఈ భారీ చారిత్రాత్మక చిత్రాన్ని అనుకున్న టైమ్ కి క్రిష్ పూర్తి చేసాడు కదా..! క్రిష్ వర్కింగ్ స్టైల్ గురించి చెప్పండి..?
క్రిష్ చాలా ప్లానింగ్ తో ఈ సినిమా తెరకెక్కించాడు. తను ఓ డిక్టేటర్ లా నాకు ఇదే కావాలి అని కాకుండా....తనకు ఏం కావాలో అందరితో డిష్కస్ చేసేవాడు. ఇప్పుడు కొంత మంది దర్శకులు ఒకే హీరోతో అవే సినిమాలు చేస్తున్నారు. కానీ...క్రిష్ అలా కాదు...ఒక్కో హీరోతో ఒక్కో రకమైన సినిమాని తీసాడు. హ్యాట్సాఫ్ టు క్రిష్.
శ్రియ క్యారెక్టర్ ఎలా ఉంటుంది.?
శ్రియ గౌతమీపుత్ర శాతకర్ణి భార్యగా నటించింది. పాత్రకు తగ్గట్టు అద్భుతంగా నటించింది.
గుర్రపు స్వారీ కోసం ట్రైనింగ్ తీసుకున్నారా..?
లెజెండ్ సినిమాలో గుర్రం పై కొన్ని సీన్స్ ఉన్నాయి. గర్రం పై నుంచి వెళ్లి గట్టిగా అద్దం పగలకొట్టే సీన్స్ ఉంటే...డూప్ లేకుండా నేనే చేస్తాను అని చెప్పి చేసాను. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఈ ఫైట్స్ ను చిత్రీకరించాం. వాళ్లకు నా ఆవేశం గురించి తెలుసు. ఈ సినిమాలో గుర్రం పై స్వారీ చేసే సన్నివేశాలు ఉంటాయి. వాటి కోసం ట్రైనింగ్ ఏమీ తీసుకోలేదు.
ఈ పాత్రను సరిగా చేయగలనా లేదా అని ఏమైనా భయపడ్డారా..?
1% కూడా భయపడలేదు. ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్, ఎం.జి.ఆర్....వీళ్లు ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. వీళ్లను తలుచుకుని ఈ పాత్ర చేసాను. ఏమాత్రం భయపడలేదు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, భైరవద్వీపం....ఇలా ఎన్నో విభిన్న పాత్రలు పోషించాను అంటే నాన్నగారే స్పూర్తి. నాన్న గారిని తలుచుకోని రోజు అంటూ ఉండదు.
సీనియర్ నటి హేమమాలిని ఈ చిత్రంలో నటించారు కదా...! ఆమె గురించి..?
హేమమాలిని గారు లేకపోతే ఈ సినిమా లేదు. నాన్న గారితో పాండవ వనవాసంలో నటించారు. ఇప్పుడు నా సినిమాలో నటించారు.
శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో నటించారు కదా..! ఆయన పాత్ర ఎలా ఉంటుంది..?
శివరాజ్ కుమార్ నటిస్తే బాగుంటుంది అనే ఐడియా నేనే ఇచ్చాను. నేను, శ్రియ సంతలో వింత చూడడానికి వెళతాం. అక్కడ ఓ సందర్భంలో ఓ పాట వస్తుంది. ఆ పాటలో శివరాజ్ కుమార్ కనిపిస్తారు. ఇప్పటి వరకు శివరాజ్ కుమార్ వేరే భాషలో నటించలేదు. నేను అడిగిన వెంటనే చేస్తాను అన్నారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ కు థ్యాంక్స్ తెలియచేస్తున్నాను.
సంక్రాంతికి చిరంజీవి ఖైదీ నెం 150, మీ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ అవుతున్నాయి. ఈ పోటీ గురించి మీరేమంటారు..?
పోటీ ఉంటే మంచిదే. మంచి క్వాలిటీ ఉన్న సినిమాలు వస్తాయి. ఇండస్ట్రీకి కూడా మంచింది. అయితే ఆ సినిమా కూడా విజయం సాధించాలి అని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం.
లెజెండ్ సినిమా చరిత్ర సృష్టించింది కదా...! మరి...గౌతమీపుత్ర శాతకర్ణి ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుంది..?
నా సినిమా రికార్డులన్నింటినీ క్రాస్ చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది
నెక్ట్స్ రైతు సినిమా చేయాలనుకుంటున్నారు కదా...! ఎప్పుడు ప్రారంభం..?
కృష్ణవంశీ గారి దర్శకత్వంలో రైతు సినిమా చేస్తున్నాను. ఇందులో అమితాబ్ గారు ఓ పాత్ర చేస్తే బాగుంటుంది అని వెళ్లి కలిసాం. అమితాబ్ గారు చేయకపోతే ఈ సినిమా ఉండదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout