107పై ఫోక‌స్ పెడుతున్న బాల‌కృష్ణ‌

  • IndiaGlitz, [Tuesday,March 10 2020]

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 106వ చిత్రం బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. ఈ చిత్రంలో బాల‌కృష్ణ రెండు పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అందులో ఓ పాత్ర అఘోరా పాత్ర‌గా ఉంటుంద‌ని అంటున్నారు. ఈ సినిమా సెట్స్‌లో ఉండ‌గానే బాల‌య్య త‌న త‌దుప‌రి సినిమాపై ఫోకస్ పెట్టాడ‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి. విన‌ప‌డుతున్న వార్త‌ల ప్ర‌కారం సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు బి.గోపాల్‌తో బాల‌కృష్ణ 107వ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ట‌. బాల‌కృష్ణ‌తో లారీ డ్రైవ‌ర్‌, రౌడీఇన్‌స్పెక్ట‌ర్‌, స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించింది బి.గోపాల్ కావ‌డం విశేషం.

దాదాపు అంతా ఓకే అయ్యింద‌ని.. ఏప్రిల్‌లో బోయ‌పాటి శ్రీను సినిమాను పూర్తి చేసిన వెంట‌నే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా బాల‌య్య మే నెల‌లోనే త‌న 107వ సినిమాను ట్రాక్ ఎక్కిస్తున్నాడ‌ట‌. ప్రీ ప్రొడ‌క్ష‌న్‌, స్క్రిప్ట్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంద‌ని అంటున్నారు.