కరోనాపై పోరాటానికి బాలయ్య భారీ విరాళం.. చిరు థ్యాంక్స్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం ప్రకటించాయి. ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ వంతుగా ప్రభుత్వాలకు సాయం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తమకు తోచినంతుగా విరాళాలు ప్రకటించగా తాజాగా.. 1 కోటి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించి నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ పెద్ద మనసు చాటుకున్నారు. ఇందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్ ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి.కళ్యాణ్‌కు అందించారు.

ప్రకటించిన కొద్దిసేపటికే..

అంతేకాదు.. ప్రకటించిన కొద్దిసేపటికే మంత్రి కేటీఆర్‌ను కలిసి చెక్కులు కూడా అందజేశారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న కరోనాపై పోరాటానికి తన వంతు విరాళంగా అందిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ తెలిపారు. స్వయం నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని, కరోనాని అరికట్టడంలో మనందరం భాగస్తులం కావాలని బాలయ్య పిలుపునిచ్చారు.

బాలయ్య అల్లుడు కూడా..

బాలకృష్ణ చిన్నల్లుడు, గీతమ్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ భరత్ కూడా 1 కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స‌హాయనిధికి రూ. 50 ల‌క్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి స‌హాయ‌నిధికి రూ. 25 ల‌క్షలు, కర్ణాటక ముఖ్యమంత్రి స‌హాయ‌నిధికి రూ. 25 ల‌క్షలు అంద‌జేస్తున్నట్లు తెలిపారు. ఈ విప‌త్కర ప‌రిస్థితిని స‌మ‌ష్టిగా ఎదుర్కోవాల‌నీ, ప్రజలు అంద‌రూ ఇళ్లల్లోనే సుర‌క్షితంగా ఉండాల‌నీ ఆయ‌న విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తెలంగాణకు విరాళాలు ఇచ్చేయడం జరిగింది.

థ్యాక్స్ చెప్పి చిరంజీవి..

సినీనటుడు చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.25 లక్షలు అందించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కల్యాణ్‌కు ఈ రూ.25 లక్షల చెక్‌ను బాలయ్య అందించారు. ఈ సాయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘నా ప్రియమైన సోదరుడా, కృతజ్ఞతలు. సీసీసీకి రూ.25 లక్షలు, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు రూ.50 లక్షల చొప్పున విరాళంగా ఇచ్చారు. అవసరం ఉన్న సమయాల్లో మీరు సాయం చేస్తూ మీ మంచి మనసుని చాటుకుంటుంటారు. ప్రతి కష్ట సమయంలోనూ ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే మీరు అన్ని వేళలా తోడుంటారు’ అని చిరు ట్వీట్ చేశారు.