నేనూ, తారక్ చేసే సినిమాలను చేయడం ఇతరుల వల్ల కావు - బాలకృష్ణ
- IndiaGlitz, [Monday,October 22 2018]
''తెలుగుదేశం పార్టీని నాన్నగారు స్థాపించినప్పుడు అన్నయ్య హరికృష్ణగారు ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్నారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ ను బంద్ చేశారు. అలాగే ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా ఉపాధి కల్పించారు. ఆయన తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. హిందూపూర్ వృద్ధికి ఎంతో తోడ్పాటు అందించారు. ఆయన లేకపోవడం మనసుకు బాధ కలిగించింది. ముక్కు సూటి మనిషి. లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా ముందుకు వెళ్లే వ్యక్తి'' అన్నారు నందమూరి బాలకృష్ణ.
ఈయన ముఖ్య అతిథిగా పాల్గొన్న 'అరవింద సమేత వీర రాఘవ చిత్ర అభినందన సభలో ఆయన మాట్లాడుతూ '' ఎన్టీఆర్ బయోపిక్‌తో బిజీగా ఉండి.. ఈ సినిమాను నేను చూడలేకపోయాను. త్రివిక్రమ్ మాటల్లో మంచి పదును ఉంటుంది. జగపతిబాబుగారు తన పాత్రలతో ఇమేజ్‌ను పదింతలు చేసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నందుకు చాలా ఆనందం. తమన్‌గారు నాలుగు పాటలు చాలా బాగా ఇచ్చారు. ఇవాళ సంగీతం అనేది సంగీతం హిట్ అయితే, సినిమా సగం హిట్ అయినట్టే లెక్క. నేనూ, మా తారక్ చేసే సినిమాలు చేయడం ఇతరుల వల్ల కావు. అలా చేయడం అసాధ్యం. అవన్నీ జీవితం కన్నా పెద్దవి. మన జీవితాల్లో భూతద్దం పెట్టి చూస్తేనే తెలుస్తాయి. మా సినిమాల్లో నవరసాలూ ఉండాలని కోరుకుంటారు ప్రేక్షకదేవుళ్లు. అందుకే మా పాత్రలు కూడా అలాగే ఉంటాయి. రీరికార్డింగ్ కూడా బలంగా ఇచ్చారు తమన్. సమష్టి కృషితో ఈ సినిమా ఇంత బాగా వచ్చింది'' అన్నారు.