ఇప్పటి వరకు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాను. ఇక కాంప్రమైజ్ కాను - బాలకృష్ణ
- IndiaGlitz, [Saturday,January 07 2017]
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రాన్ని జాగర్లమూడి క్రిష్ తెరకెక్కించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తెలుగు వారు గర్వించదగ్గ చిత్రంగా రూపొందిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం విజయం సాధించాలని కోరుకుంటూ బాలయ్య అభిమాని అనంతపురం జగన్ ఆధ్వర్యంలో భారతదేశంలోని 100 పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ 100 పుణ్యక్షేత్రాల్లో చేసిన ప్రత్యేక కుంకుమను, పుణ్య నదీ జలాలను అనంతపురం జగన్ బాలకృష్ణకు అందచేసారు.
ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో చిత్ర నిర్మాత బిబో శ్రీనివాస్ మాట్లాడుతూ... గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రకు బాలయ్య జీవం పోసారు. అసలు శాతకర్ణి ఎలా ఉంటారో ఎవరూ చూడలేదు. కానీ...బాలయ్య ఆ పాత్రను పోషించిన విధానం చూస్తుంటే శాతకర్ణి ఇలానే ఉంటాడు అనిపిస్తుంది. బాలయ్య కొన్ని వేల క్యాన్సర్ బాధితులకు సహాయ సహకారాలను అందిస్తున్నారు. బాలయ్య స్పూర్తితో అభిమానులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి. మా సంస్థ తరుపున సహాయ సహకారాలను అందిస్తాం అన్నారు.
బాలయ్య అభిమాని అనంతపురం జగన్ మాట్లాడుతూ... అభిమానులను ఇతను మా అభిమాని అని గర్వంగా చెప్పే ఏకైక కథానాయకుడు మా బాలయ్య. ఆయన స్పూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం. తెలుగు వారికి గర్వకారణం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా. ఈ సినిమా ఘన విజయం సాధించి 100 కోట్లు వసూలు చేస్తుంది అన్నారు.
బాలకృష్ణ మాట్లాడుతూ... ప్రజా సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన తెలుగు జాతి గర్వించదగ్గ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. ముక్కలు ముక్కలుగా ఉన్న రాష్ట్రాలను ఏకతాటి పై తీసుకువచ్చి.... విదేశీలు ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా భయపడేలా చేసిన గొప్ప చక్రవర్తి పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నాను. గౌతమీపుత్ర శాతకర్ణి గురించి చాలా తక్కువ సమాచారం మాత్రమే లభించింది. అయితే..మాకు గౌతమీపుత్ర శాతకర్ణి గురించి ఎంతో సమాచారాన్ని అందించి ఇటీవలే మరణించిన పరబ్రహ్మ శాస్త్రి, కృష్ణ శాస్త్రిలకు నివాళులర్పిస్తున్నాను. లక్షల కోట్ల అభిమానులు పొందడం అనేది పూర్వ జన్మ సుకృతం. అభిమానులతో నాకు విడదీయలేని అనుబంధం. అభిమానుల ఆశీర్వాదమే నాకు శ్రీరామరక్ష. అలాగే నాన్న గారు గురించి చెప్పాలంటే...ఆయనే దైవం...ఆయనే గురువు నాకు అంతా ఆయనే.అందుకనే మా అబ్బాయికి తారక రామ మోక్షజ్ఞ అని పేరు పెట్టాను.
నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. నాన్నగారితో చెబితే ఫస్ట్ చదువుకోమన్నారు. లేకపోతే చిన్నప్పటి నుంచి నటించడం మొదలుపెట్టి ఉంటే ఇప్పటికి 250 సినిమాలు అయ్యేవి. ఎన్ని సినిమాలు చేసామని కాదు...కళామతల్లికి ఎంత సేవ చేసాం అనేది ముఖ్యం. యువరత్న, నటసింహం, ఎమ్మెల్యే....ఇలా నన్ను ఏమిని పిలిచినా అదంతా అమ్మ ఆశీర్వాదం వలనే అని భావిస్తున్నాను. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నాం. అద్భుతమైన చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్ర నిర్మాతలకు అభినందనలు తెలియచేస్తున్నాను. మనందరం ఈ చిత్ర నిర్మాతలకు రుణపడి ఉన్నాం. పాటలు అద్భుతంగా ఉన్నాయి. సినిమా కూడా తప్పకుండా బాగుంటుంది. సాయిమాధవ్ దేశం మీసం తిప్పుదాం లాంటి ఎన్నో అద్భుతమైన సంభాషణలు అందించారు. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చారు. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఇప్పటి వరకు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాను. ఇక కాంప్రమైజ్ కాను అన్నారు.