బాత్రూమ్ తలుపేసుకున్న ఇనయా.. బద్ధలుకొట్టబోయిన రేవంత్ , గీతూపై బాలాదిత్య ఫైర్
- IndiaGlitz, [Wednesday,November 02 2022]
రోజులు గడుస్తున్న కొద్ది బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇక కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసే పని కూడా బిగ్‌బాస్ మొదలుపెట్టాడు. అయితే గత వారం సంచాలక్‌గా గీతక్క ప్లే చేసిన స్ట్రాటజీకి కంటెస్టెంట్స్ వణికిపోయారు. నిన్న అందరూ కలిసి ఇనయాను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె తీరు ఇదేనని చెబుతూ.. ఒక్కొక్కరు అన్న మాటలతో ఇనయా బాగా హర్ట్ అయ్యింది. గీతూ, శ్రీసత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఫైమా, రేవంత్‌లు ఇనయాను టార్గెట్ చేశారు. ముఖ్యంగా సూర్య హౌస్‌ను వీడటానికి ఆమె కారణమని నానా మాటలు అన్నారు. దీంతో బాగా కుమిలిపోయిన ఇనయా బాత్‌రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. దీంతో ఏం జరుగుతుందోనని ఇంటి సభ్యులంతా వెళ్లి ఇనయాను బయటకు రావాల్సిందిగా బతిమలాడారు. రేవంత్ అయితే తలుపు బద్దలుకొట్టేస్తానని చెప్పాడు. ఎవరి వల్లా కాకపోవడంతో చివరికి బిగ్‌బాస్ కలగజేసుకున్నాడు. ఇక్కడికి రావడం వరకే మీ వంతు.. వెళ్లిపోవడమన్నది ప్రేక్షకుల మీద ఆధారపడి వుంటుందని ఇనయాను కన్ఫెషన్ రూమ్‌లోకి తీసుకెళ్లి హిత బోధ చేసి పంపాడు.
తర్వాత ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీదారులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా ఇంటి సభ్యులను రెండు జట్లుగా విభజించాడు. గీతూ, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమా, కీర్తిలు రెడ్ టీమ్‌లో ... బాలాదిత్య, ఇనయా, మెరీనా, రోహిత్, వాసంతి, ఆదిరెడ్డిలు బ్లూటీమ్‌లో వున్నారు. అయితే రాజ్ కోసం రెండు జట్లు కొట్టుకున్నాయి. చివరికి బ్లూటీమ్ అతన్ని సొంతం చేసుకుంది. గేమ్‌లో భాగంగా కంటెస్టెంట్స్ భుజాలపై వున్న నాలుగు స్ట్రిప్పులను లాగేస్తే ఆ టీమ్ సభ్యుడు చనిపోయినట్లు. కండబలం, బుద్ధి బలం చూపించుకోవచ్చని బిగ్‌బాస్ పర్మిషన్ ఇవ్వడంతో గేమ్ ఫిజికల్‌గా మారింది. ఒకరి మీద ఒకరు పడి స్ట్రిప్పులు లాక్కున్నారు. తొలుత ఫైమా, తర్వాత బాలాదిత్యలు ఔట్ అయ్యారు.
ఇక గీతక్క తన మైండ్‌కి, నోటికి పనిచెప్పింది. మళ్లీ ఎదుటివారి వీక్‌నెస్, ఎమోషన్స్‌తో ఆడుకోవడం మొదలుపెట్టి, వారిని ఎలాగైనా దెబ్బకొట్టాలని ప్లాన్ చేసింది. గీతూ చేతిలో కీలుబొమ్మల్లా మారిపోయిన శ్రీహాన్, శ్రీసత్యలు కూడా ఇందుకు సహకరించారు. ముగ్గురూ కలిసి బాలాదిత్య సిగరెట్, లైటర్‌ను దాచేశారు. అవి ఇవ్వాలంటే నాలుగు స్ట్రిప్పులు ఇవ్వాల్సిందేనని గీతూ బేరాలు సాగించింది. దీంతో బాలాదిత్యకు కోపం నషాళానికి అంటింది. నువ్వు ఎంతకు దిగజారుతున్నావో అర్ధమవుతోందా అంటూ గీతూకు గడ్డిపెట్టాడు. ఆటలో ఆడి గెలవాలి కానీ ఇదేం పద్దతి అంటూ ఊగిపోయాడు. అయినా గీతూ, శ్రీసత్యలు తగ్గకపోవడంతో బాలాదిత్య కంటతడిపెట్టాడు. దీన్ని నమ్మొద్దు అని ఎంతమంది చెప్పినా.. తాను మాత్రం బంగారం అనే చెప్పానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇంటి సభ్యులు ఆయనను ఓదార్చారు.
అనంతరం తనను బాలాదిత్య నానారకాలుగా తిట్టాడంటూ ఆదిరెడ్డికి చెప్పుకుని బాధపడింది గీతూ. అటు బాలాదిత్యకు నోరు లాగేస్తూ వుండటంతో సిగరెట్లు సంపాదించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో కీర్తి భట్‌కు దెబ్బ తగలడంతో ఆమెకు బదులుగా ఆటను ఆడే అవకాశాన్ని ఫైమాకు ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో గేమ్ స్ట్రాటజీ మార్చాలని రెండు జట్లు లెక్కలు వేసుకున్నాయి. రేపు కూడా టాస్క్ నడిచే అవకాశం వుండటంతో ఏం జరుగుతుందోనని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మొత్తం మీద ఈ వారం రేవంత్, ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, కీర్తి, శ్రీసత్య, ఇనయా, రోహిత్, మెరీనా,ఫైమా ఇలా మొత్తం పది మంది నానినేషన్స్‌లో వుండగా.. కెప్టెన్ శ్రీహాన్, రాజ్, వాసంతిలను ఒక్కరూ నామినేట్ చేయకపోవడం విశేషం.