డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్..
- IndiaGlitz, [Wednesday,October 07 2020]
ముంబై: డ్రగ్స్ కేసులో నటుడు సుశాంత్ చక్రవర్తి ప్రియురాలు రియా చక్రవర్తికి బెయిల్ లభించింది. గత నెల 9 నుంచి ముంబై బైకుల్లా జైలులో రియా ఉంది. అయితే ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు డ్రగ్ డీలర్ అబ్దుల్ బాసిత్, శామ్యూల్ మిరాండా, దీపేశ్ సావంత్‌లను హైకోర్టు బెయిలు నిరాకరించింది. రియా చక్రవర్తికి ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముంబై విడిచి వెళ్లొద్దని సూచిస్తూ షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. గతంలో ముంబై సెషన్స్ కోర్టును ఆమె బెయిల్ కోసం ఆశ్రయించగా... తిరస్కరించింది. దీంతో రియా చక్రవర్తి ముంబై హైకోర్టును ఆశ్రయించి ఎట్టకేలకు బెయిల్ సంపాదించింది.
సుశాంత్ మృతి కేసులో రియా పేరు ప్రముఖంగా వినిపించడంతో సీబీఐ రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను విచారించింది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్లో డ్రగ్స్ కోణం వెలుగు చూసింది. దీంతో డ్రగ్స్ కేసును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారించింది. ఈ నేపథ్యంలోనే రియా డ్రగ్స్ మాఫియాతో జరిపిన వాట్సాప్ మెసేజ్‌లు వెలుగు చూశాయి. ఆమె వాటిని డిలీట్ చేసినప్పటికీ ఎన్సీబీ తిరిగి సంపాదించింది. ఈ కేసులో సుశాంత్‌కు మాదకద్రవ్యాలు చేరవేసినట్లు ఆమె అంగీకరించింది. తానేమీ డ్రగ్స్ వాడలేదని, కానీ సుశాంత్‌కు తెచ్చి ఇచ్చేదాన్ని అని రియా ఎన్సీబీతో చెప్పింది.
డ్రగ్స్ మరొకరికి తెచ్చి ఇవ్వడం చాలా తీవ్రమైన నేరమని ఎన్సీబీ అధికారులు తెలిపారు. డ్రగ్స్ సిండికేట్‌లో రియా యాక్టివ్‌గా ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి ముంబై బైకుల్లా జైలుకు తరలించారు. నెల రోజుల తర్వాత ఆమెకు నేడు షరతులతో కూడిన బెయిల్ లభించింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు.. పదిరోజుల పాటు పోలీష్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. అదే విధంగా గ్రేటర్ ముంబై నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే విచారణాధికారికి సమాచారం ఇవ్వాలని రియాకు హైకోర్టు షరతు విధించింది.