Kejriwal: లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు
- IndiaGlitz, [Saturday,March 16 2024]
ఢిల్లీ లిక్కర్ కేసులో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. విచారణలో భాగంగా రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రూ.15000 బాండ్, రూ.లక్ష పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. కేజ్రీవాల్‌పై మోపిన అభియోగాలు బెయిల్ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లని న్యాయమూర్తి పేర్కొన్నారు.
కాగా లిక్కర్ కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఇప్పటివరకు 8 సార్లు సమన్లు జారీ చేశారు. అయితే కేజ్రీవాల్ మాత్రం విచారణకు హాజరుకాలేదు. తనపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై అప్పుడు విచారణ జరిపిన న్యాయస్థానం ఫిబ్రవరి 17న కోర్టుకు రావాలని ఆదేశించింది. ఆ సమయంలో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున వర్చువల్‌గా హాజరైన ఆయన తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
అనంతరం ఈడీ వరుసగా సమన్లు పంపుతూనే ఉంది. మార్చి 4న విచారణకు హాజరుకావాలని పిలిచినా పట్టించుకోలేదు. అయితే విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. మార్చి 12 తర్వాత వర్చువల్‌గా హాజరవుతానని షరతు విధించారు. దీంతో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించడంతో మార్చి 16న తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో ఆయన కోర్టు ముందు హాజరయ్యారు. ఆయన హాజరుకావడంతో విచారణ జరిపిన న్యాయమూర్తి కేజ్రీవాల్‌పై ఈడీ మోపిన అభియోగాలు బెయిల్ పొందేందుకు ఆస్కారం ఉన్నవని తెలిపారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ ఇచ్చారు. దీంతో ఆయన కోర్టు నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. మొత్తానికి కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడంతో ఆప్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.