Aha OTT : 'ఆహా' కొత్త మార్కెటింగ్ హెడ్‌గా బద్దం రాజశేఖర్
Send us your feedback to audioarticles@vaarta.com
మిస్ అయిన సీరియల్స్, మంచి వెబ్ షోలు, థియేటర్లకు వెళ్లకుండానే కొత్త సినిమాలు ఇవన్నీ చూసేందుకు అందుబాటులో వచ్చినవే ఓటీటీలు. లాక్డౌన్ పుణ్యామా అని వీటికి ఎక్కడా లేని డిమాండ్ వచ్చి పడింది. ప్రస్తుతం ఓటీటీ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు దూసుకుపోతోంది. బడా నిర్మాణ సంస్థలు, కార్పోరేట్ కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెట్టడం, ప్రేక్షకులు కూడా కోవిడ్ భయం.. టిక్కెట్ల ధరల కారణంగా ఓటీటీలకు మొగ్గుచూపుతుండడంతో వీటి మార్కెట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఓటీటీ సంస్థల పోటీ కూడా అదే స్థాయిలో పెరిగింది. ఈ నేపథ్యంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ రంగంలో వున్న వృద్ధిని గమనించి తెలుగులో మొట్టమొదటి సారిగా ‘‘ఆహా’’ పేరిట ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు.
తన వ్యూహాలతో ఆహాను పటిష్ట స్థితికి చేర్చిన అల్లు అరవింద్ :
ఇప్పటికే వెబ్ సిరీస్‌లు, సినిమాలు, షోలతో ‘‘ఆహా’’ దూసుకెళ్తోంది. 2000కు పైగా వున్న వినోద కార్యక్రమాలు, 32 మిలియన్ల డౌన్ లోడ్స్, 12 మిలియన్ల నెలవారీ యాక్టీవ్ యూజర్లతో ఆహా పటిష్టంగా వుంది. తెలుగు, తమిళంతో పాటు యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, దక్షిణాసియా, మలేషియా, సింగపూర్లలో తన సేవలను అందిస్తోంది. మారుతున్న కాల మాన పరిస్ధితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మారుస్తూ ఆహాను ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తున్నారు అల్లు అరవింద్. ప్రేక్షకులకు ఏం కావాలో.. ఏం చేస్తే వారికి నచ్చుతుందో ఆయనకు బాగా తెలుసు. అందుకే అనతి కాలంలోనే ఆహాను తిరుగులేని సంస్థగా నిలబెట్టారు.
ఆహా బ్రాండ్ ప్రమోషన్లో రాజశేఖర్ కీలకపాత్ర :
ఇదిలావుండగా.. ‘‘ఆహా’’ మార్కెటింగ్ హెడ్‌గా బద్దం రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఈవో రవికాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజశేఖర్‌ను ఈ పదవికి నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే, ఇండియన్ ఐడల్ తెలుగు షోలతో పాటు కలర్ ఫోటో, భామాకలాపం, 3 రోజెస్, కుడి ఎడమైతే వంటి సినిమాలకు మంచి మార్కెటింగ్ నిర్వహించిన ఘనత రాజశేఖర్ సొంతమని రవికాంత్ ప్రశంసించారు. ఆహా బ్రాండ్ విస్తరణలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రస్తుతం ఆహా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో వున్న రాజశేఖర్ సేవలను మరింత విస్తరించడానికి మార్కెటింగ్ హెడ్‌గా బాధ్యతలు అప్పగించినట్లు రవికాంత్ తెలిపారు.
మార్కెటింగ్‌లో రాజశేఖర్‌కు 13 ఏళ్ల అనుభవం:
తన నియామకంపై రాజశేఖర్ స్పందించారు. మార్కెటింగ్ హెడ్‌గా ఆహా బ్రాండ్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని తెలిపారు. కాగా.. మార్కెటింగ్‌లో రాజశేఖర్‌కు 13 సంవత్సరాల అనుభవం వుంది. మైహోమ్స్ గ్రూప్ కార్పోరేట్ కమ్యూనికేషన్ విభాగంలో ప్రయాణాన్ని కొనసాగించిన ఆయన ఆ బ్రాండ్‌కు అనతికాలంలోనే మంచి గుర్తింపును తీసుకొచ్చారు. ఆయన ప్రతిభను గుర్తించిన యాజమాన్యం ఆహా మార్కెటింగ్ వ్యవహారాల బాధ్యతను అప్పగించింది.
మార్చిలో ఆహాలో వినోదాల పంట :
ఇకపోతే.. ఆహాలో మే నెలలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న గీతా సుబ్రమణ్యం వెబ్ సిరీస్ సీజన్ 3 ప్రేక్షకులని అలరించనుంది. నవదీప్- బిందు మాధవి జంటగా తెరకెక్కిన ‘‘న్యూసెన్స్’’ ఫస్ట్ సీజన్ స్ట్రీమింగ్ కానుంది. అలాగే సర్కార్ సీజన్ 3 గేమ్ షో, సత్తిగాని రెండెకరాలు మూవీలతో ప్రేక్షకులను అలరించడానికి ఆహా రెడీ అవుతోంది. మరి వీటన్నింటికి మార్కెటింగ్ కల్పించడంతో రాజశేఖర్ అండ్ టీమ్ ఎలాంటి స్ట్రాటజీలు అమలు చేస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com