కొన్ని కుటుంబాల వల్లే రాయలసీమకు చెడ్డ పేరు
- IndiaGlitz, [Friday,March 01 2019]
కొన్ని కుటుంబాల వల్ల రాయలసీమకు చెడ్డ పేరు వస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. కడప నగరంలోని శ్రీనివాస రెసిడెన్సీలో పవన్ జనసేన కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాయలసీమ ఎంతో చైతన్యవంతమైన నేల. నర్సింహస్వామి వెలసిన నేల. అన్నమయ్య నడియాడిన నేల. మతసామరస్యానికి ప్రతీకైన నేల. అలాంటి నేలకు బాంబులు వేసి, దాడులు చేసి కొన్ని కుటుంబాలు చెడ్డ పేరు తీసుకొచ్చాయిఅని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ వాళ్లు పంచెలు కట్టుకుని దౌర్జన్యాలు చేస్తారన్న చెడ్డపేరు పోగొట్టేందుకే పంచెకట్టుకున్నానన్నారు. రాయలసీమలో వర్గ ప్రభావం ఉంది కానీ, కోస్తాలో ఉన్నట్లు కుల ప్రభావం లేదన్నారు.
మంచి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చా...
జనసైనికులకు ఏడాదికి రూ. 10 లక్షలు చొప్పున 5 ఏళ్లకు రూ. 50 లక్షల ఆరోగ్య బీమా ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నాం. మార్చి 14 నుంచే ప్రక్రియ మొదలు పెడతాం. జనసేన ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తాం. రాయలసీమలో ఏ మూలకు వెళ్లిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. యువత, ఆడపడుచులు మార్పు కోసం రోడ్లపైకి వచ్చి జనసేన పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. కానీ నాయకులు మాత్రం పార్టీలోకి రావటానికి భయపడుతున్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటుందోనని నన్ను అడుగుతున్నారు. మంచి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చాను. ఫ్యూడలిజం కోటల్ని బద్దలు కొట్టడానికి వచ్చాను. మీకు దమ్ముంటే నాతో నడవండి. జనసేన పార్టీలోకి రావాలంటే ఫ్యూడలిక్ భావాలు వదులుకుని రావాలి. అదే భావాలతో పార్టీలోకొస్తానంటే కుదరదు. ఇప్పటికీ కొంతమంది నాయకుల ఇళ్ల ముందు నుంచి నడుచుకుంటూ వెళ్లాలంటే చేతుల్లో చెప్పులు పట్టుకుని వెళ్లాలా..? వేల కోట్లు, ప్రైవేటు సైన్యం చూసి భయపడాలా..?నాకు అలాంటి భయాలు లేవు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నవాడిని, యుద్ధ విద్యలను అర్ధం చేసుకున్నవాడిని. ఎవడో ఒకడు తెగించాలి. ఒకడికి వెన్నెముకలో ధైర్యం పుట్టుకొస్తే.. అది లక్షల, కోట్ల మందిని నిలబెడుతుంది. అందుకే నిలబడ్డాను అని పవన్ చెప్పుకొచ్చారు.
సీమలో జనసేన పార్టీకి బలం లేదా?
రాయలసీమలో రాజకీయం అంటే కొన్ని కుటుంబాల గుత్తాధిపత్యంలా మారింది. కొత్తవారు నిలబడలేని పరిస్థితి సృష్టించారు. సమాజంలో మార్పు రావాలంటే కొంతమంది చేతుల్లోనే అధికారం ఉంటే ఎలా..? అహంకారంతో విర్రవీగిన బ్రిటిష్ వాళ్ళను తన్ని తరిమేశారు. ఫ్రాన్స్ రాజుపై ప్రజలే తిరుగుబాటు చేసి గద్దె దించారు. ఉద్యమానికి నాయకుడు అవసరం లేదు. ప్రజలు చాలు. ప్రజల నుంచే నాయకులు పుడతారు. అవసరాలే నాయకులను తయారు చేస్తాయి. సీమలో జనసేన పార్టీకి బలం లేదంటున్నారు. ప్రజలు అన్యాయానికి గురైన చోట, కడుపు మండిన ప్రతిచోట జనసేనకు బలం ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు మొదట గుర్తొచ్చేది జనసేన పార్టీయే. పిరికితనంతో పారిపోయి, దాష్టికంతో నలిగిపోతుంటే వాటిని ఎదుర్కొవాలన్నా గుర్తొచ్చేది జనసేన పార్టీయే. వేలకోట్లు, న్యూస్ చానల్స్ , పేపర్లు ఏమీ లేని జనసేన పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నారు. మేము నథింగ్ అనుకుంటే దాడులు చేయాల్సిన అవసరం, తిట్టాల్సిన అవసరం ఏముంది. ఇవన్ని చేస్తున్నారంటే మనం చాలా బలంగా ఉన్నామని అర్ధం అని పవన్ చెప్పారు.
వృత్తి.. ప్రవృత్తి గురించి..
నా వృత్తి సినిమా అయితే.. నా ప్రవృతి సమాజ సేవ. లక్షకోట్ల బడ్జెట్ ఉంటే అధికార, ప్రతిపక్ష పార్టీల్లా 5 లక్షల కోట్ల హామీలు ఇవ్వను. మేము అమలు చేయగలిగిందే చెబుతాం. 2019లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే నాణ్యమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను పెంచడంతో పాటు ఎంపీ కొడుకు కూడా వెళ్లి చదువుకునే స్థాయికి పాఠశాలలను బలోపేతం చేస్తాం. టూరిజం అభివృద్ధి చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పంటకు మద్దతు ధర కాదు లాభసాటి ధర కల్పిస్తాం. మహిళలకు ఉచిత గ్యాస్ తో పాటు రేషన్ కు బదులు వారి ఖాతాల్లో రూ. 2500 నుంచి రూ. 3500 నగదు జమ చేస్తాం. కడప పర్యటన చాలా సంతృప్తినిచ్చింది. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు తన వంతు కృషి చేస్తానుఅని జనసేనాని హామీ ఇచ్చారు.