DSC Exam:తెలంగాణలో నిరుద్యోగులకు బ్యాడ్ న్యూస్.. డీఎస్సీ పరీక్ష వాయిదా
- IndiaGlitz, [Friday,October 13 2023]
తెలంగాణలో నిరుద్యోగులకు మరో నిరాశ ఎదురైంది. ఇప్పటికే గ్రూప్2 పరీక్షలు వాయిదా పడగా.. తాజాగా డీఎస్సీ పరీక్షను వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20 నుంచి 30 వరకు డీఎస్సీ రాతపరీక్ష జరగాలి. ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరిస్తు్న్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, నవంబర్ 30న పోలింగ్ జరగనుండడంతో డీఎస్సీని వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. తదుపరి రాత పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది.
5,089 పోస్టులకు సెప్టెంబర్ 8న నోటిఫికేషన్..
మొత్తం 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ సెప్టెంబర్ 8న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల కావడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా చేసేదేమీ లేక విడుదలైన పోస్టులకే దరఖాస్తు చేసుకుంటున్నారు. అక్టోబర్ 21వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించారు. మొత్తం 5,089 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, పీఈటీ పోస్టులున్నాయి.
షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్ష..
షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20 నుంచి 30 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. నవంబర్ 20, 21న స్కూల్ అసిస్టెంట్లు(సబ్జెక్టు), నవంబర్ 22న స్కూల్ అసిస్టెంట్(లాంగ్వెజ్) నవంబరు 23న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తామని పేర్కొ్‌న్నారు. నవంబరు 24న లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులకు రెండు విడతల్లోనూ.. నవంబరు 25 నుంచి 30 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పరీక్షలు చేపడతామని షెడ్యూల్‌లో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేశారు.