Babu Mohan:బీజేపీకి ఊహించని షాక్.. పార్టీకి బాబుమోహన్ రాజీనామా..
Send us your feedback to audioarticles@vaarta.com
పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాబుమోహన్(Babu Mohan) పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమలం నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. నేతల వైఖరి తీవ్ర అభ్యంతకరంగా ఉందని పొమ్మనకుండా పొగపెడుతున్నారంటూ వాపోయారు. బీజేపీ కోసం చాలా కష్టపడ్డానని.. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేశానని గుర్తు చేశారు. ఏ, బీ, సీ, డీ సెక్షన్లుగా నాయకులను విభజించి అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తనను డీ కేటగిరిలో పెట్టి అవమానించారని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల నుంచి తనను దూరం పెడుతూ వస్తున్నారని.. కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్‌ను ఆశించానని.. కానీ సీటు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. కచ్చితంగా ఒక్కసారైనా వరంగల్ ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బాబు మోహన్ ఆందోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేశారు. రెండు సార్లు ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుంచి బాబు మోహన్ కుమారుడు ఉదయ్ మోహన్‌కు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం ప్రయత్నించింది. అయితే తమ పార్టీ పెద్దలు కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని బాబూ మోహన్ ఆరోపించారు. దీంతో చివరి నిమిషంలో బాబూ మోహన్ టికెట్ కేటాయించారు. కానీ ఈ ఎన్నికల్లో మూడో స్థానానికే ఆయన పరిమితమయ్యారు.
కాగా హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాబు మోహన్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. చంద్రబాబు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరారు. 2004, 2014లో జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2018 ఎన్నికలకు ముందు కాషాయం కండువా కప్పుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout