Babu Mohan:ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్.. సాదరంగా ఆహ్వానించిన కేఏ పాల్..
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనకు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల ఆయన బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర కమలం నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. నేతల వైఖరి తీవ్ర అభ్యంతకరంగా ఉందని పొమ్మనకుండా పొగపెడుతున్నారంటూ వాపోయారు. బీజేపీ కోసం చాలా కష్టపడ్డానని.. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేశానని గుర్తు చేశారు.
సొంత పార్టీ నేతలే బీజేపీ ఓడాలని చూస్తున్నారు.. వీళ్లేం లీడర్లు.. ఇలాంటి నేతలను తాను ఏ పార్టీలోనూ చూడలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీళ్లకు వెదవలు కావాలి కానీ.. బాగా పనిచేసే వారు పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవాలి అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే తనను వాడుకొని బీజేపీ వదిలేసిందని.. బీజేపీ నేతలు పొమ్మనలేక పొగబెడుతున్నారని వాపోయారు. వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావించగా.. టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో బీజేపీ నుంచి బయటికి వచ్చారు.
తన జీవితంలో ఒక్కసారైనా వరంగల్ నుంచి కచ్చితంగా లోక్‌సభకు పోటీ చేస్తానని.. ఎంపీగా గెలుస్తానని చెప్పారు. అయితే ఆయన అనూహ్యంగా ప్రజాశాంతి పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మంత్రిగా, ఎమ్మెల్యేగా, నటుడిగా పనిచేసిన వ్యక్తి.. అసలు ఉనికిలోనే లేని పార్టీలో చేరడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రజాశాంతి పార్టీ నుంచి వరంగల్ ఎంపీగా పోటీ చేయనున్నారట.
ఇదిలా ఉంటే 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బాబు మోహన్ ఆందోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేశారు. రెండు సార్లు ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుంచి బాబు మోహన్ కుమారుడు ఉదయ్ మోహన్‌కు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం ప్రయత్నించింది. అయితే తమ పార్టీ పెద్దలు కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని బాబూ మోహన్ ఆరోపించారు. దీంతో చివరి నిమిషంలో బాబూ మోహన్ టికెట్ కేటాయించారు. కానీ ఈ ఎన్నికల్లో మూడో స్థానానికే ఆయన పరిమితమయ్యారు.
కాగా హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాబు మోహన్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. చంద్రబాబు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరారు. 2004, 2014లో జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2018 ఎన్నికలకు ముందు కాషాయం కండువా కప్పుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments