అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? `బాహుబలి` తొలి పార్ట్ విడుదలైనప్పటి నుంచీ అందరి నోటా కట్టప్ప మాటే. మాహిష్మతి సామ్రాజ్య ప్రశస్తి మన రాష్ట్రం, దక్షిణ దేశం, భారతదేశం దాటి ప్రపంచంలోని నలు మూలలకు వ్యాపించింది. మహేంద్ర బాహుబలి అలియాస్ శివుడుని శివగామి ఎందుకు నీటికొండ దిగువకు తెచ్చింది? బాహుబలిని కంటికి రెప్పలా కాపాడిన కట్టప్ప ఎందుకు కత్తిపట్టాడు? శత్రువులను తన శౌర్యంతో మట్టికరిపిస్తున్న అమరేంద్ర బాహుబలి వెన్నులో ఎందుకు కత్తి దింపాడు? మహారాణి శివగామి మాహిష్మతి రాజ్యాన్ని ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది? అవంతిక తన వారితో కలిసి ఎందుకు దేవసేనను కాపాడాలనుకున్నది? అవంతికకు, దేవసేనకు ఉన్న రిలేషన్‌షిప్ ఏంటి? కుంతల రాజ్యపు యువరాణి దేవసేన, కత్తిని పదనుగా తిప్పడం తెలిసిన దేవసేన, నాలుగు అమ్ములను ఒకేసారి లాఘవంగా విసరడం తెలిసిన దేవసేన... భల్లాల దేవుడి ప్రాంగణంలో ఇనుప గజ్జెలతో, మాసిన బట్టలతో, తైలసంస్కారం లేని కురులతో ఎందుకు పుల్లలు ఏరుకోవాల్సి వచ్చింది? ఇంతకీ అమరేంద్ర బాహుబలి చనిపోయాడా? లేదా?... ప్రేక్షకుల మదులను తొలుస్తున్న ఎన్నో ప్రశ్నలకు పదునైన సమాధానం `బాహుబలి - ది కంక్లూజన్`. ఆలస్యం ఎందుకు? చదివేయండి మరి...
కథ:
నీట మునిగిన శివగామి చేతిని మాత్రం పైకి ఉంచి, ఆ చేతిలో బిడ్డను ఆటవికులకు అప్పగించి చేతిని నీటికొండవైపు చూపిస్తుంది. ఆ బిడ్డను ఆటవిక దంపతులు శివుడు అని పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తారు. తన చేతిలో పడిన ఓ ముఖాకృతిని పట్టుకుని నీటికొండను సునాయాసంగా శివుడు ఎక్కేస్తాడు. అక్కడికి వెళ్లాక అతనికి చాలా విషయాలు తెలుస్తాయి. `ఎప్పుడూ చూడని కళ్లు నన్ను దేవుడిలా చూస్తున్నాయి. ఇంతకీ నేనెవరినీ` అని శివుడు అడుగుతాడు. `మా దేవుడు అమరేంద్రబాహుబలి తనయుడివి.. మహేంద్రబాహుబలివి` అని కట్టప్ప చెబుతాడు. అంతటితో ఆగకుండా తన చేతులతో తానే అమరేంద్రబాహుబలిని చంపినట్టు కూడా కట్టప్ప చెబుతాడు. ఇంతవరకు తొలి భాగంలో వచ్చే కథ.
రెండో భాగం టైటిల్స్ లోనూ ఈ కథను దర్శకుడు చెప్పాడు. ఆ తర్వాత ఫ్ల్యాష్ బ్యాక్‌ను చూపిస్తాడు. అమరేంద్రబాహుబలి (ప్రభాస్)ను దేశాటనం చేసి ప్రజల కష్టసుఖాలను తెలుసుకోమని చెబుతుంది రాజమాత శివగామి (రమ్యకృష్ణ). వెంట కట్టప్ప (సత్యరాజ్)ను తీసుకుని దేశాటనం వెళ్తాడు అమరేంద్ర బాహుబలి. మధ్యలో పిండారీలు (ఒక వర్గం దోపిడీ ముఠా) గురించి తెలుసుకుంటాడు. వారిని మట్టుబెట్టడానికి వీరవనిత కుంతల దేశపు యువరాణి దేవసేన (అనుష్క) కత్తితో పోరాడుతుంది. ఆమె వెంట ఆమె బావ కుమారవర్మ (సుబ్బరాజు) కూడా ఉంటాడు. గుంపులో బాహుబలిని చూసిన యువరాణి ప్రజలను కాపాడాలని హితవు పలుకుతుంది. కానీ అంతలో ఆమెపై బాహుబలికి మనసైన విషయాన్ని గమనించిన కట్టప్ప తన మేనల్లుడికి ఏమీ రాదని చెబుతాడు. యువరాణితో పాటు వీరిరువురు కూడా కుంతల సామ్రాజ్యానికి చేరుకుంటారు. అక్కడ జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా బాహుబలి మహావీరుడని అర్థం చేసుకుంటుంది దేవసేన. అంతలో జరిగిన చిన్న అపార్థాల వల్ల దేవసేనను బంధీగా తీసుకుని రమ్మంటుంది రాజమాత శివగామి. బాహుబలి తోడుగా నూరేళ్లు ఉండటానికి సిద్ధపడ్డ దేవసేన బంధీగా మాత్రం క్షణకాలం కూడా రానంటుంది. ఆమె గౌరవానికి ఏమాత్రం భంగం రానివ్వనని మాటిస్తాడు బాహుబలి. మరోవైపు భల్లాల దేవుడికి దేవసేననిచ్చి పెళ్లి చేస్తానని అంటుంది రాజమాత. అటు తల్లిమాట నెగ్గాలా? ఇటు బాహుబలి మాట నెగ్గాలా? అనే క్రమంలో బాహుబలి తన మాట మీద నిలబడుతాడు. రాజమాత అహం దెబ్బతింటుంది. దానికి తోడు చెప్పుడు మాటలను వింటుంది. ఆ క్రమంలో కట్టప్ప చేత బాహుబలిని చంపిస్తుంది. ఇదంతా విన్న మహేంద్ర బాహుబలి తన తల్లికి సంకెళ్ళ నుంచి విముక్తి కలిగించి.. ఆమె పేర్చిన చితిపై భల్లాలదేవుడిని ఎలా కాల్చేశాడన్నది క్లైమాక్స్.
ప్లస్ పాయింట్లు:
కుంతల దేశం చూడచక్కగా అనిపిస్తుంది. కుంతల సామ్రాజ్యంలో స్త్రీలు జరుపుకునే గోపిక పూర్ణిమ పండుగ బావుంది. కన్నయ్యను నిద్రపుచ్చుతూ పాడే పాటలో అనుష్క చాలా అందంగా కనిపించింది. అనుష్క, ప్రభాస్ మధ్య వచ్చే సన్నివేశాల్లో రొమాన్స్ గుంభనంగా ఉంది. ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాలి. నటులందరూ తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. గ్రాఫిక్స్ ఫస్ట్ పార్టును తలదన్నేలా ఉన్నాయి. పాటలు బావున్నాయి. రీరికార్డింగ్ కూడా బావుంది. మాహిష్మతి రాజాస్థానం, భల్లాలదేవుడి పాలన, ప్రజలు, సినిమా ప్రారంభంలో అమరేంద్ర బాహుబలి ఏనుగు పొగరు అణచే సన్నివేశం వంటివన్నీ ఆకట్టుకుంటాయి. దానికి తోడు ఎద్దుల కొమ్ములకు నిప్పంటించి చేసిన ఫైటు, కుంతల సామ్రాజ్యాన్ని కాపాడటం కోసం ఆనకట్టను పగలకొట్టే విధానం, బాహుబలికి వైజ్ఞానిక శాస్త్రం పట్ల ఉన్న అభిలాష వంటివన్నీ మెప్పిస్తాయి. అనుష్క, రమ్యకృష్ణ ఉన్న సన్నివేశాల్లో పోటాపోటీగా నటించిన వైనం కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత ఇద్దరు మహిళలు ఎదురెదురుగా తలపడి నటించినట్టు అనిపిస్తుంది.
మైనస్ పాయింట్లు:
సినిమాలో మైనస్ పాయింట్లు అని వేలెత్తి చూపించదగ్గవి పెద్దగా ఉండవు. కాకపోతే ఈ రెండో భాగంలో అక్కడక్కడా కొందరికి, ప్రత్యేకించి అనుష్కకు తప్ప కాస్ట్యూమ్ డిజైనర్స్ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. కుమారవర్మ పాత్ర ద్వారా నవ్వు తెప్పించాలనుకున్నారు కానీ ఆ ప్రయత్నం విఫలమైనట్టు అనిపిస్తుంది. ఆ పాత్ర సరిగా నవ్వించలేకపోయిందన్నది వాస్తవం. తొలిసగంలో `ఇది నా మాట. నా మాటే శాసనం` అని అన్నీ తెలుసుకుని మసలుకున్న శివగామి ఇందులో చెప్పుడు మాటలు వింటూ, తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేని అశక్తురాలిగా కనిపిస్తుంది. అప్పటిదాకా ప్రాణంగా చూసుకున్న కట్టప్ప కేవలం రాజాజ్ఞ కోసం బాహుబలిని చంపడం అనేది ఎవరూ ఊహించరు. పదుల బాణాలు గుచ్చుకున్నా లెక్కచేయని బాహుబలి కట్టప్ప కత్తితో పొడవగానే చనిపోవడం చాలా పేలవంగా అనిపిస్తుంది. కట్టప్ప ఎందుకు చంపాడన్నది ఊరించి ఊరించి చివరికి దర్శకుడు తేల్చేసేశాడన్నది ఇట్టే అర్థమైపోతుంది. ప్రేక్షకుడికి దర్శకుడు చెప్పిన కారణం పెద్ద కన్విన్సింగ్గా అనిపించవు.
విశ్లేషణ:
బాహుబలి సినిమా ఒక మామూలు సినిమా స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగింది. బాహుబలి గేమ్, బాహుబలి మెర్చండైజ్, బాహుబలి సినిమాకు ముందు ఏం జరిగిందనే అంశాలతో మూడు పార్టులుగా పుస్తకం, బాహుబలి గ్రాఫిక్స్... ఒకటా రెండా.. బాహుబలి ఉపశాఖలు చాలానే వచ్చాయి. ఇదంతా బాహుబలి ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన సందడే. తాజాగా బాహుబలి ది కంక్లూజన్ కూడా ఆ స్థాయిని చేరుకునేలా తెరకెక్కింది. తొలి భాగంలో మాహిష్మతి సామ్రాజ్యం మాత్రమే కనిపించింది. కానీ పార్ట్ 2 లో కుంతల సామ్రాజ్యం కూడా కనులపండువగా అనిపించింది. ప్రభాస్, అనుష్క జంటగా ఇంతకు ముందు చిత్రాల్లో కన్నా ఈ సినిమాలో మరింతగా అలరించారు. ప్రభాస్, రానా ఇద్దరూ యుద్ధ సన్నివేశాల్లో ఒకరిని మించేలా మరొకరు కనిపించారు. అనుష్క, రమ్యకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు పోటాపోటీగా అనిపించాయి. ఫస్ట్ పార్ట్ ను శ్రద్ధగా చూసిన ఎవరైనా సెకండ్ పార్ట్ ను ఇట్టే ఊహించేయవచ్చు. `నేను రాజపీఠానికి బానిసను. రాజాజ్ఞను కాదనలేను` అని ఫస్ట్ పార్ట్ లో నే కట్టప్ప చెబుతాడు. అంటే కేవలం రాజాజ్ఞ, రాజమాత శివగామి ఆజ్ఞను అనుసరించే కట్టప్ప చంపాడన్నది సులభంగానే ఊహించవచ్చన్నమాట. అలాగే `పరమేశ్వరా.. నేను చేసిన తప్పులకు నన్ను క్షమించు.. కానీ ఈ బిడ్డను బతికించు` అని ఫస్ట్ పార్ట్ లో శివగామి చెబుతుంది. ఈ డైలాగును శ్రద్ధగా విన్నా కూడా కథను ఊహించవచ్చు. కేవలం ఈ రెండు డైలాగుల మీద సెకండాఫ్‌ను అల్లుకున్నారు. కొన్ని సీన్లు రక్తి కట్టించాయి. బిజ్జలదేవుడిగా ఎడమచేయి బాగాలేనివాడిగా నాజర్ నటన కూడా అద్భుతం. ఇందులో ఏ పాత్రా వృథాగా అనిపించలేదు. రాజప్రాసాదాలకు, రాజ సభలకు, అంతఃపురాలకు సంబంధించి సాబు సిరిల్ ఎక్కువగా ఆగ్రా ఫోర్ట్ ను మోడల్‌గా తీసుకున్నట్టు ఇట్టే తెలిసిపోతుంది. అహంకారం వల్ల, తన మాట నెగ్గాలనుకోవడం వల్ల, ఈర్ష్య, అసూయల వల్ల రాజ్యాలు కూలిపోయాయని చరిత్ర చెబుతోంది. దాన్ని ఊహాత్మకంగా జానపదానికి జోడించి ఈ కథను అల్లారు. అక్కడక్కడా భావోద్వేగాలు పండాయి. అనుష్క సీమంతం సీన్‌తో సహా పలు సన్నివేశాల్లో ఉండాల్సిన లోతు లేదనిపిస్తుంది. తేలిపోయిన భావన కలుగుతుంది. కథను, సన్నివేశాల బలాన్ని, సినిమా నిడివిని పక్కనపెడితే తొలిసగంలో ప్రేక్షకుడికి కలిగిన ప్రశ్నలకు ఈ చిత్రం సమాధానమవుతుంది.
బాటమ్ లైన్: భళారే... బాహుబలి!
Comments