నాని హీరోగా వరుస సక్సెస్‌లు సొంతం చేసుకుంటున్న తరుణంలో నిర్మాతగా మారాడనే న్యూస్ టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. నాని తీయబోయే సినిమా ఎలా ఉంటుందోననే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ ఆసక్తిని రెట్టింపు చేస్తూ నాని తన సినిమా టైటిల్‌ను అ! అని అనౌన్స్ చేశాడు. ఏదో చిన్న చిన్న నటీనటులతో కాకుండా స్టార్ నటీనటులను ఇందులో నటింపచేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. అదీగాక తెలుగు సినిమాలో రానటువంటి కథతో అ! సినిమా రూపొందిందని ప్రమోషన్స్‌లో బల్ల గుద్ది మరీ చెప్పారు. సరే.. మరి నిజంగానే అ! సినిమా తెలుగులో రాని కథతో తెరకెక్కిందా? అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం..
కథ:
ఓ రెస్టారెంట్‌లో కథ మొదలవుతుంది. పది పాత్రలు ఈ కథలో ఇన్ వాల్వ్ అయ్యి ఉంటాయి. వాటి గురించి చెప్పాలంటే కాలి ( కాజల్ అగర్వాల్) ఓ మానసిక ఒత్తిడితో ఉంటుంది. లెస్బియన్స్ రాధ (ఈషా రెబ్బా), కృష్ణవేణి ( నిత్యామీనన్)లు వారి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. తానొక పెద్ద మేజిషియన్ అని భావించే యోగి(మురళీశర్మ), ఓ బిజినెస్ డీల్ మాట్లాడటానికి వచ్చిన వ్యక్తి దగ్గర ఐదు కోట్ల రూపాయలను కొట్టేయాలనుకునే మీరా( రెజీనా).. తన తల్లిదండ్రులను కలుసుకోవడానికి టైం మిషన్‌ను తయారు చేయాలనుకునే సైంటిస్ట్ శివ (అవసరాల శ్రీనివాస్), అతని భవిష్యత్ రూపంలో ఉండే ఫిమేల్ వెర్షన్ (దివ్య దర్శిని), వంట రాకపోయినా యూ ట్యూబ్ ద్వారా మేనేజ్ చేసేయాలనుకునే నాలా (ప్రియదర్శి).. అతనికి వంట చేయడానికి సహాయపడే పాత్రల్లో చేప, చెట్టు వీటి చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ పాత్రలన్నింటికీ కామన్‌గా ఓ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఏంటి? అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో ప్రతి పాత్రను దర్శకుడు కథకు లింక్ చేసిన విధానం బావుంది. ప్రతి పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రియదర్శి పాత్రలో కామెడీని జనరేట్ చేసేలా నాని వాయస్ ఓవర్‌లో చేప, చెట్టు వాయిస్ ఓవర్‌లో రవితేజ చెప్పే సంభాషణలు బావున్నాయి. సినిమాలో ప్రతి సీన్ చాలా రిచ్ లుక్‌తో కనపడింది. మార్క్ కె.రూబిన్స్ నేపథ్య సంగీతం బావుంది. పాత్రల్లో నటించిన కాజల్ అగర్వాల్, రెజీనా, నిత్యామీనన్, ఈషారెబ్బా, మురళీవర్మ, ప్రియదర్శి, రోహిణి, ప్రగతి ఇలా అందరూ చక్కగా ఒదిగిపోయారు. సాహిసురేష్ ఆర్ట్ వర్క్ ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్:
సినిమాలో ఎక్కువ పాత్రలను తీసుకుని వాటిని ఓ లింక్ ఆధారంగా కలపడం అనే పాయింట్ పాతదే. అయితే ఇక్కడొచ్చిన చిక్కు ఏంటంటే.. పాత్రలు మరి ఎక్కువైపోవడం.. వాటిని కలిపే లింక్ బాలేకపోవడమే. అసలు దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసుకున్న పాత్రలు ఎక్కువ కావడంతో వాటి ఇంట్రడక్షన్‌లోనే ఫస్టాఫ్ గడిచిపోతుంది. కథకు సంబంధం లేని హారర్ ఎలిమెంట్‌ను మధ్యలో తీసుకురావడం.. క్లైమాక్స్‌కు వచ్చేసరికి పాత్రలు గందగోళం ఎక్కువైంది. కామన్ ఆడియెన్‌కి ఇలాంటి సినిమా కనెక్ట్ అవుతుందో అంటే కనెక్ట్ కాదనే చెప్పేస్తారు. గందరగోళంగా ఉన్న ఈ సినిమా నుండి బయటకు వచ్చే ప్రేక్షకుడికి సినిమా ఎంటనే విషయంపై క్లారిటీ మిస్ అవుతుంది.
సమీక్ష:
సినిమాకు ప్రధాన బలం నటీనటులే. ముఖ్యపాత్రల్లో నటించిన ఆర్టిస్టులందరూ వారి నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. అసలు కాజల్ చేసిన పాత్ర ఇప్పటి వరకు చేయని పాత్ర. ఇక రెజీనా డగ్ర్ అడిక్ట్ అమ్మాయిగా కొత్త లుక్‌లో కనపడింది. అలాగే దెయ్యం అవహించిన అమ్మాయిలా కూడా చక్కగా నటించింది. ఇక మేజిషియన్‌గా మురళీశర్మ బాత్రూంలో పడే ఇబ్బందులు ఆడియెన్స్‌కి చిన స్మైల్‌ని తెప్పిస్తాయి. ఈషారెబ్బా, నిత్యామీనన్ పాత్రలు తల్లిదండ్రులను ఆలోచింప చేస్తాయి. ఇక ప్రియదర్శి పాత్రకు సహకారం అందించిన చేప, చెట్టులకు నాని, రవితేజ వాయిస్ ఓవర్ చెప్పడం ప్రధాన బలంగా మారింది. సమాజంలో జరిగే తప్పులు వల్ల అసలు చిన్న అమ్మాయిలు మానసిక పరివర్తన అనేది ఎలా మారుతుందనే విషయాన్ని చెప్పడానికి దర్శకుడు ఇన్ని పాత్రలతో సినిమా చేశాడు. అయితే దర్శకుడు పాత్రలను మిక్స్ చేసిన కామన్ పాయింట్ అందరికీ కనెక్ట్ కాదు. సరికదా సినిమా ఏంటోనననే కన్‌ఫ్యూజన్‌ను క్రియేట్ చేసింది. దర్శకునికి సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఆర్ట్ వర్క్ వెన్నెముకలా నిలిచాయి.
బోటమ్ లైన్: అ!...గందరగోళంగా మారిన కొత్తదనం
Awe Movie Review in English
Comments