హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో 'అ!'...!
- IndiaGlitz, [Wednesday,February 07 2018]
నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. అ!' మూవీని సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. నిత్యా మీనన్, కాజల్, రెజీనా, ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్.. ఇలా భారీ తారాగణమే ఉన్న ఈ సినిమా.. ఇప్పటికే ఫస్ట్ లుక్స్, టీజర్, ట్రైలర్స్‌తో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా మొత్తం ఒక ఫైవ్ స్టార్ హోటల్ నేపథ్యంలో సాగనుందని సమాచారం. అందుకోసమే కిచెన్ సెట్, రెస్టారెంట్ సెట్ వేసారట. వంట రాని ఓ చెఫ్ (ప్రియదర్శి) కిచెన్‌లో నానా పాట్లు పడుతూ ఉంటే...అక్కడ ఆక్వేరియంలో ఉన్న ఒక చేప (నాని) ఆ చెఫ్‌కి సలహాలను ఇస్తుందట. వంట చేయడం తనకి ఎలా తెలుసంటే.. ఇంతకు ముందు ఉన్న చెఫ్‌లను చూసి నేర్చుకున్నానని చెబుతుందట చేప. ఈ తతంగం అంతా చూస్తున్న బోన్సాయ్ మొక్క (రవితేజ) ఇద్దరినీ ఆటపట్టిస్తూ ఉంటుందట. ఇలా సరదాగా సాగిపోయే ఈ కథలో రెస్టారెంట్లో వచ్చే రకరకాల పాత్రలతో సినిమా ఆసక్తిగా ఉంటుందట.
అయితే ఈ ఐడియా మాత్రం 2007లో వచ్చిన హాలీవుడ్ మూవీ రాటటూలి' నుంచి తీసుకున్నారని కొంతమంది వాదిస్తున్నారు. ఇక్కడ చేప చెఫ్‌కి వంట నేర్పిస్తే...ఆ మూవీలో ఎలుక చెప్తూ ఉంటే వంట చేయడం నేర్చుకుంటాడు చెఫ్. అలాగే హోటల్లో రకరకాల పాత్రలతో కొన్ని కథలు సమాంతరంగా సాగుతూ ఉంటాయి. చివరికి అవన్నీ కూడా ఒక చోట చేరుకుంటాయి. మరి ఈ కథని ప్రేరణ పొందారో, లేక కాపీ కొట్టారో తెలియాలంటే ఫిబ్రవరి 16 వరకు వేచి ఉండాల్సిందే. ఈ చిత్రం ద్వారా ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.