'బాహుబలి' కొడాలిని ఢీ కొట్టనున్న అవినాష్..
Send us your feedback to audioarticles@vaarta.com
హ్యాట్రిక్ ఎమ్మెల్యే.. వైసీపీలో ‘బాహుబలి’గా పేరుగాంచిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఢీ కొనేందుకు టీడీపీ అధిష్టానం అభ్యర్థిని ఫిక్స్ చేసింది. ఇన్ని రోజులు అసలు ఇక్కడ్నుంచి ఎవర్ని దింపాలి..? ఎవర్ని బరిలోకి దింపితే గెలిచే అవకాశాలుంటాయ్..? ఇప్పటి వరకూ పోటీచేసిన వ్యక్తినే మళ్లీ బరిలోకి దింపాలా..? లేకుంటే కొత్త వ్యక్తిని రంగంలోకి దింపితే ఎలా ఉంటుంది..? అని కొన్ని సర్వేలు చేయించిన సీఎం చంద్రబాబు ఎట్టకేలకు యువనేత దేవినేని అవినాష్ పేరును ఖరారు చేశారు. శుక్రవారం రాత్రి సుధీర్ఘంగా చర్చించిన అనంతరం ఫైనల్‌గా ఈ ప్రకటన విడుదల చేయడం జరిగింది.
ఇన్ని రోజులుగా గుడివాడలో నెలకొన్న ఉత్కంఠకు చంద్రబాబు తెరదించారని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు గుడివాడ టీడీపీకి కంచుకోట. దివంగత ముఖ్యమంత్రి తారకరామారావు కూడా రెండు పర్యాయాలు ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2004 నుంచి గుడివాడ అంటే కొడాలి.. కొడాలి అంటే గుడివాడ అన్నట్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రెండుసార్లు అనగా 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన కొడాలి నాని.. ఫస్ట్ టైం 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున 11,537 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కూడా గుడివాడలో వైసీపీ జెండా ఎగరేసి తీరుతానని ధీమాతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా షురూ చేసేశారు కొడాలి.
దేవినేని ఫ్యామిలీ అంటే కృష్ణా జిల్లాలో మంచి పేరుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఒకప్పుడు దేవినేని, రంగా ఫ్యామిలీస్ కృష్ణా జిల్లాను ఏలాయని చెప్పుకోవచ్చు. నాటి నుంచి నేటి వరకూ ఈ రెండు కుటుంబాలు ప్రత్యర్థులే. అయితే ఈ పేరు చాలు గుడివాడలో టీడీపీ జెండా ఎగరేయడానికి అని భావించిన టీడీపీ అధిష్టానం ప్రత్యేకంగా సర్వేలు చేయించి అనంతరం దేవినేని అవినాష్ పేరును ఖరారు చేయడం జరిగింది. కాగా.. కాలేజీ టైమ్‌లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు యువత తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో జనాల్లోకి దూసుకెళ్లారు.
దేవినేని ఫ్యామిలీ పేరే కాదు.. సామాజిక వర్గం పరంగా కూడా కలిసిసొస్తుందని టీడీపీ భావిస్తోంది.. కచ్చితంగా కొడాలిపై కనీసం 5వేలు మొదలుకుని 10వేల మెజార్టీ వరకు అవినాష్‌కు వస్తుందని ముందే పార్టీ నేతలు ఊహించేసుకున్నారట. అయితే వైసీపీ అభ్యర్థి అయిన కొడాలి మాత్రం సీఎం చంద్రబాబు అయినా సరే దమ్ముంటే తనపై పోటీ చేసి గెలుచుకోవాలని ఇప్పటికే పలుమార్లు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. నాటి నుంచి నానిని టార్గెట్ చేసిన టీడీపీ... ఈ ఎన్నికల్లో కచ్చితంగా ఓడించాలని భావిస్తోంది. అయితే అవినాష్ ఏ మాత్రం కొడాలిని ప్రభావితం చేస్తారు..? కొడాలి అడ్డాపై టీడీపీ జెండా అదృష్టం అవినాష్‌కు ఏ మాత్రం దక్కుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments