క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆసీస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ దుర్మరణం

రెండు నెలల క్రితం దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన ఆస్ట్రేలియా క్రికెట్‌కు మరో షాక్ తగిలింది. మరో దిగ్గజ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శనివారం రాత్రి టౌన్స్‌విల్లే సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో సైమండ్స్ కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. తన అంతర్జాతీయ క్రీడా జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న అతికొద్దిమంది క్రికెటర్లలో సైమండ్స్ కూడా ఒకరు.

ఆండ్రూ సైమండ్స్ నివసిస్తోన్న టౌన్స్‌విల్లేకు 50 కిలోమీటర్ల దూరంలో వున్న హెర్వీ రేంజ్‌లో జరిగిన ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి 11 సమయంలో హెర్వీ రేంజ్ రోడ్‌లోని ఆలిస్ రివర్ బ్రిడ్జ్ సమీపంలో వెళ్తుండగా.. సైమండ్స్ ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన సైమండ్స్‌ను ఆసుపత్రికి తరలించారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సైమండ్స్ తుది శ్వాస విడిచారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ క్రాష్ యూనిట్ దర్యాప్తు చేస్తోంది.

ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియా తరపున 198 వన్డేల్లో 5,088 పరుగులు , 26 టెస్టుల్లో 1,462 పరుగులు చేశాడు. 2003, 2007లలో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు. 2003 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై అద్భుతమైన సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మైదానంలో రికీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్‌లతో కలిసి మెరుపు ఫీల్డింగ్ చేసి ప్రశంసలు అందుకున్నాడు. ఆఫ్ స్పిన్‌తో ప్రత్యర్ధులను ముప్పు తిప్పలు పెట్టే సైమండ్స్ .. వన్డేలలో 133, టెస్టుల్లో 24 వికెట్లు తీసుకున్నాడు. 2022లో మరణించిన ఆస్ట్రేలియా క్రికెటర్లలో ఆయన మూడో వ్యక్తి. ఇప్పటికే మార్చి మొదటి వారంలో షేన్‌వార్న్, రోడ్నీ మార్ష్‌లు కన్నుమూసిన సంగతి తెలిసిందే. సైమండ్స్ మరణంతో క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు.