క్రికెట్ ప్రపంచానికి షాక్.. ఆసీస్ దిగ్గజం షేన్‌వార్న్ కన్నుమూత
- IndiaGlitz, [Friday,March 04 2022]
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. థాయిలాండ్‌లో వున్న ఆయనకు శుక్రవారం గుండెపోటు రావడంతో వార్న్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 1992లో ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఎంపికైన వార్న్ అనతికాలంలోనే కీలక బౌలర్‌గా ఎదిగాడు. దాదాపు 15 ఏళ్లపాటు క్రికెట్‌కు సేవలందించిన షేన్‌వార్న్ 2007లో రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
ఆసీస్ తరపున మొత్తం 145 టెస్టులు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు , 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టారు. టెస్టుల్లో 37సార్లు 5 వికెట్లు తీయగా, 10 సార్లు 10 వికెట్లు తీసిన ఆటగాడిగా షేన్ వార్న్ చరిత్ర సృష్టించాడు. ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ (800) ఈ లిస్టులో ముందున్నాడు. వార్న్ మృతి పట్ల పలువురు క్రికెటర్లు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం తెలిపారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ షేన్‌వార్న్ తనదైన ముద్ర వేశాడు. ఐపీఎల్ తొలి ఎడిషన్‌లోనే రాజస్థాన్ రాయల్స్‌ను విజేతగా నిలిపాడు. కెప్టెన్, మెంటార్‌గా ఆర్‌ఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2011 వరకు రాజస్థాన్‌కు సారథిగా పనిచేశాడు.