ట్రాక్ పై నిద్రిస్తున్న 17 మంది మృతి
- IndiaGlitz, [Friday,May 08 2020]
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కష్టకాలంలో వరుస విషాద ఘటనలు జరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే లెక్కలేనన్ని.. ఎవరూ కలలో కూడా ఊహించని విషాద ఘటనలు జరిగాయి. అవి జరిగి 24 గంటలు కూడా ముగియక మునుపే ఘోర రైలు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్వగ్రామాలకు బయల్దేరిన రైల్వే కూలీలు ట్రాక్‌పై నిద్రిస్తుండగా వారిపై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 17 మంది వలస కూలీలు అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన వైద్యం అందిస్తున్నారు. ఈ గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
కర్మాద్ ప్రాంతంలో ఘోరం..
చనిపోయిన వారిలో కొందరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలియవచ్చింది. కాగా వీరంతా మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్నట్లుగా పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన ఉదయం 06:30 గంటలకు చోటు చేసుకుంది. ఔరంగాబాద్- జల్నా మధ్యలోని కర్మాద్ ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. రైల్వే ట్రాక్‌పై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అక్కడి ప్రభుత్వం మీడియాకు వెల్లడించలేదు. కాగా ఈ ఘటనపై దర్యాప్తునకు రైల్వే శాఖ ఆదేశించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే రైలును నడుపుతున్న లోకో ఫైలట్ కాస్త సమయస్పూర్తితో వ్యవహరించి ఉంటే ఇలా 17 మంది ప్రాణాలు పోయేవి కాదేమో.. అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రభుత్వాలు పట్టించుకోలేదా..!?
ఇదిలా ఉంటే.. లాక్‌డౌన్ కావడంతో వలస కూలీలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు కాలినడకనే బయల్దేరారు. ఇప్పటికే చాలా వరకు కార్మికులను ‘శ్రామిక్ రైళ్లు’ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వగ్రామానికి తరలిస్తున్నాయి. మరి తాజాగా జరిగిన ఈ ప్రమాద బాధితులు ఎందుకు కాలినడకన వెళ్తున్నారు..? ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఎలాంటి సహాయం అందించలేదా..? ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు..? అసలేం జరిగింది..? అనే విషయాలు తెలియరాలేదు.
కలచివేస్తున్న దృశ్యాలు..
కాలినడకన వెళ్తున్న ఆ కూలీలు ఔరంగాబాద్ చేరుకుని ఇప్పుడు రైళ్లు తిరగట్లేదు కదా అని ట్రాక్‌పైనే అలానే నిద్రపోయారు. కానీ ఆ ట్రాక్ వారిని కబలించింది. నిద్రలోనే వారంతా కళ్లు మూస్తామని అనుకోలేదు. లాక్ డౌన్ మొదట్నుంచీ నిత్యావసరాలను రైళ్లు, ప్రత్యేక బస్సులు, లారీల ద్వారా తరలింపు జరుగుతూనే ఉంది. కానీ ఈ విషయం ఎరుగని ఆ కూలీలు అలా నిద్రపోయి నిద్రలేనే కన్నుమూసేశారు. ఈ విషాధ ఘటన తాలుకూ చిత్రాలు జనాలు మనసును కలచివేస్తున్నాయి. ఇప్పటి వరకూ 17 మంది మృతి చెందగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ ఘోర ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.