ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ‘అత్త’ ఆసక్తికర వ్యాఖ్యలు
- IndiaGlitz, [Sunday,April 07 2019]
టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న విషయం విదితమే. అయితే 2009 ఎన్నికల్లో మామయ్య కోసం ఎన్నికల్లో ప్రచారం చేసిన జూనియర్ ఆ తర్వాత రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోకుండా సినిమాలపైనే దృష్టిసారించారు. అయితే గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ వల్ల గెలిచిన టీడీపీ.. ఈసారి ఆయన సపరేట్ అయ్యి పోటీ చేస్తుండటంతో పక్కాగా జూనియర్ బరిలోకి దిగుతారని భావించారు. అయితే అది అస్సలు జరగలేదు. అంతేకాదు సొంత అక్క నందమూరి సుహాసిని కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగినప్పటికీ కనీసం ప్రచారానికి కూడా నందమూరి బ్రదర్స్ పోలేదు.
ఇక అసలు విషయానికొస్తే.. తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో జూనియర్ అత్త, బీజేపీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్ గురించి అడగ్గా ఆమె సమాధానం ఎలా చెప్పారో మీరే చూడండి. జూనియర్ ఎన్టీఆర్‌కు ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. ఎన్టీఆర్ ఇప్పుడే రాజకీయాల్లోకి రానని నాకు ఎన్నోసార్లు చెప్పారు. నాకు సినిమాల్లో మంచి భవిష్యత్ ఉంది. ఆ అంశంపై అంతగా చర్చించాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు నన్ను అడిగితే కచ్చితంగా సలహాదారుగా ఉండేందుకు సిద్ధమే. కానీ ఉచిత సలహాలు మాత్రం ఇవ్వను అని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ..వైసీపీ గురించి మాట్లాడిన ఆమె.. వైసీపీ నుంచి తనకు ఎలాంటి ఆఫర్లు రాలేదని, రాజకీయాల్లో ఉన్నంతవరకు బీజేపీని వీడే ఆలోచన లేదన్నారు. ఒకవేళ వీడాల్సి వస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటాను తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. అయితే అత్త ఇచ్చిన సలహాదారు ఆఫర్‌కు జూనియర్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.