Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వంలో దాడులు, దోపిడీలే: పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
రాబోయే ఎన్నికల్లో కూటమిదే విజయమని.. మెజారిటీ ఎంత అనేది మాత్రమే తేలాల్సి ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తంచేశారు. గుడివాడలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పాల్గొని కూటమి అభ్యర్థుల తరపున ప్రసంగించారు. బూతులు తిట్టేవాళ్లను, గోతులు తవ్వేవాళ్లను ఇంటికి సాగనంపాలన్నారు. రాజకీయ నేతల బూతులు, దాడులకు పన్ను వేస్తే దేశంలో నిధులకు కొరతే ఉండదని వ్యాఖ్యానించారు. ఇంట్లో ఉన్నవాళ్లను కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం.. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప చేసిందేమీ లేదన్నారు.
ఇక్కడి ఎమ్మెల్యే కొడాలి నానిని తిట్టాల్సిన కోరిక తనకు లేదన్నారు. వంగవీటి రాధా పెళ్లికి వెళ్లినప్పుడు కొడాలి నాని తనకు కనపడితే కలిశానని చెప్పారు. అయితే నాని నోరును కట్టడి చేయాలంటే గుడివాడలో కూటమి అభ్యర్థి వెనిగండ్ల రామును గెలిపించాలని విన్నవించారు. జగన్‌ను, వైసీపీ నాయకులను చూసి భయపడాలా అని ప్రశ్నించారు. ప్రజలు భయం వీడాలని.. ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన నేలను విడిచి ఎక్కడికి పారిపోతాం.. మీ గుండెల్లో ధైర్యం నింపడానికే తానొచ్చు అని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తనకు ముఖ్యమని, స్వేచ్ఛ పోయినరోజు ఎన్ని వేల కోట్లున్నా నిష్ర్పయోజనమే అని తెలిపారు.
రాష్ట్రంలోనే పేరు పొందిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. జగన్ గుర్తుంచుకో... మీ నాన్న కంటే ముందు చాలా మంది గొప్పవాళ్లు ఉన్నారు. మీ నాన్న పేరు పెట్టుకోవద్దు అనడంలేదు... కానీ ఇతర మహనీయులు ఎంతోమంది ఉన్నారు... వారికి గౌరవం కల్పించాలని సూచించారు. అలాగే చంద్రబాబు బలమైన నాయకుడని జైలులో ఉన్నా కూడా ఆయన ఏ మాత్రం తొణకలేదన్నారు. అలాంటి వ్యక్తికి అండగా ఉండాలని ఆనాడే నిర్ణయించుకున్నానని పవన్ చెప్పుకొచ్చారు.
ఇక ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా ప్రజలను హెచ్చరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారని విమర్శించారు. భూముల ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం అట్టిపెట్టుకుంటుందని.. దీని వల్ల మన భూములపై కనీసం లోన్ తెచ్చుకునే అవకాశం కూడా ఉండదని వివరించారు. ముందు పట్టాదారు పుస్తకాలపై తన బొమ్మ వేసుకున్నాడని, ఆ తర్వాత సరిహద్దు రాళ్లపై తన బొమ్మ వేసుకున్నాడని తెలిపారు. వైసీపీ మద్దతుదారులకు కూడా ఒకటే చెబుతున్నా... జగన్ వస్తే మీ ఆస్తులపై మీరు హక్కులు వదిలేసుకున్నట్టే అని వార్నింగ్ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments